పకడ్బందీగా వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణ
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని ఏడు మండలాల్లో బుధవారం చివరి విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అచ్చంపేట, అమ్రాబాద్, పదర, లింగాల, బల్మూరు, ఉప్పునుంతల, చారకొండ మండలాల పరిధిలోని 134 గ్రామాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. తుది విడతలో 23 పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు, ఆర్వోలు, ఎన్నికల సిబ్బంది మంగళవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లకు అవగాహన కల్పించడంతోపాటు బీఎల్‌ఓల ద్వారా ఇంటింటికీ ఓటరు స్లిప్పులు పంపిణీ చేపట్టారు.
కౌంటింగ్, ఉపసర్పంచ్ ఎన్నికకు ఏర్పాట్లు..
బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తుది విడత పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటిగంటలోపు పోలింగ్ కేంద్రంలో క్యూలైన్‌లో ఉన్నవారందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. మధ్యాహ్నం పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సైతం ముందుగానే సిద్ధం చేశారు. గ్రామాల్లో ఓటర్ల సంఖ్య వెయ్యిలోపు ఉన్న చిన్న గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు చేపట్టిన గంటలోపే ఎన్నికల ఫలితం తేలనుంది. మండల కేంద్రాలతోపాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో బుధవారం రాత్రి వరకు కౌంటింగ్ కొనసాగనుంది.


