పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ఉప్పునుంతల/ చారకొండ: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జి పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన ఉప్పునుంతల, చారకొండ పోలీస్‌స్టేషన్లను సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. ముందుగా ఉప్పునుంతల మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ భద్రత, సమస్యాత్మక గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న భద్రత చర్యలు తదితర అంశాలపై ఎస్‌ఐ వెంకట్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మక గ్రామాల్లో నిఘాతోపాటు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడి బ్యాలెట్ బాక్స్‌లు తీసుకెళ్లే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలుబడిన తర్వాత కూడా గ్రామాల్లో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్పీ వెంట కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐలు వీరబాబు, రాజశేఖర్, మహేష్‌గౌడ్, కురుమూర్తి తదితరులున్నారు.
● ఉప్పునుంతల మండలంలోని మర్రిపల్లిలో నిర్వహించిన పోలీస్ కవాతులో ఏఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కవాతులో అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.


