బాలికలకు హెచ్‌పీవీ టీకా తప్పనిసరి
నాగర్‌కర్నూల్ క్రైం: మహిళలకు వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానం ఆక్రమిస్తుందని, 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా చేయడం వల్ల భవిష్యత్‌లో సర్వైకల్ క్యాన్సర్ వల్ల కలిగే అస్వస్థత, మరణాలను తగ్గించవచ్చని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రవికుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వైద్య సిబ్బందికి హెచ్‌పీవీ టీకాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 14 ఏళ్లలోపు అమ్మాయిలు సుమారు 9,500 మంది ఉన్నారని, ఈ నెల 14 ఏళ్లు పూర్తయిన అమ్మాయిల జాబితాను తయారుచేసి జనవరిలో హెచ్‌పీవీ టీకాకరణ అమలు చేస్తామన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ముందస్తుగా అమ్మాయిలు, వారి తల్లిదండ్రులకు హెచ్‌పీవీ టీకాపై అవగాహన కల్పించాలని సూచించారు. పీహెచ్‌సీల వారిగా ఆడపిల్లల జననాలు తగ్గిన ప్రాంతాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, లింగ నిర్ధారణ నిషేధ చట్టం గురించి వివరించాలని చెప్పారు. ఈ నెల 18 నుంచి 31 వరకు సిబ్బంది ఇంటింటికి వెళ్లి కొత్తగా కుష్టు వ్యాధిగ్రస్తులను గు ర్తించడానికి ముమ్మర సర్వే చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


