
డిజిటల్ లైబ్రరీనివినియోగించుకోవాలి
నాగర్‌కర్నూల్: పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువత డిజిటల్ లైబ్రరీని వినియోగించుకోవాలని ఎంపీ మల్లు రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంలో నూతన డిజిటల్ లైబ్రరీ విభాగాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్‌తో కలిసి ఎంపీ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. సీఎస్‌ఆర్ నిధుల నుంచి యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో ప్రత్యేకంగా రూ.3.67 లక్షలతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ పోటీ పరీక్షలు, వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల మెటీరియల్‌ను ఆన్‌లైన్ ద్వారా సేకరించుకునేందుకు డిజిటల్ లైబ్రరీ తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్, లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, శ్రీనివాస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం
జిల్లాలో ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని, సీఎస్‌ఆర్ నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల నమోదును వంద శాతం పూర్తి చేయాలని ఎంపీ మల్లు రవి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఎంపీ నిధుల అభివృద్ధి పనుల పురోగతి, సీఎస్‌ఆర్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రహదారులు, భవనాలు, పాఠశాలలు, వసతిగృహాలు వంటి అన్ని పనులను వేగంగా పెంచాలన్నారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతిగృహాల్లో ఖాళీ పోస్టుల వివరాలు సేకరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం ఉన్నారు.