వేతన వ్యథ! | - | Sakshi
Sakshi News home page

వేతన వ్యథ!

Jul 14 2025 4:35 AM | Updated on Jul 14 2025 5:19 AM

అవస్థలు పడుతున్నాం..

గ్రామాల్లో అన్ని పనులు చేసేది మేమే. ఇచ్చే కొద్దిపాటి జీతాలు కూడా పెండింగ్‌లో పెడుతుండటంతో అవస్థలు పడుతున్నాం. పెండింగ్‌ వేతనాల కోసం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. కార్మికుల ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడం లేదు. – కలమండల దాసు, కార్మికుడు,

కాంసానిపల్లి, ఉప్పునుంతల మండలం

ఒకట్రెండు

రోజుల్లో చెల్లిస్తాం..

జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఒకట్రెండు రోజుల్లో మూడు నెలలకు సంబంధించిన వేతనాలు చెల్లిస్తాం. ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయ్యింది. ఆయా పంచాయతీ కార్యదర్శుల నుంచి నివేదికలు తీసుకున్నాం. కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం.

– శ్రీరాములు, ఇన్‌చార్జి డీపీఓ

పంచాయతీ కార్మికులకు అందని వేతనాలు

మూడు నెలలుగా అవస్థలు

పట్టించుకోని అధికారులు

సమ్మెకు సిద్ధమవుతున్న కార్మికులు

అచ్చంపేట రూరల్‌: గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో ఆందోళన చెందుతున్నారు. తప్పని పరిస్థితుల్లో అప్పులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. గ్రామాల పరిశుభ్రతకు పాటుపడే తమకు నెలనెలా వేతనాలు అందించడంపై సంబంధిత అధికారులు శ్రద్ధ చూపడం లేదని కార్మికులు వాపోతున్నారు.

పనులు చేసేందుకు నిరాసక్తత..

గ్రామాల్లో చెత్త సేకరణ, మురుగు కాల్వల శుభ్రత, పిచ్చిమొక్కల తొలగింపు, నీటి పైపుల లీకేజీలు, వీధి దీపాలకు మరమ్మతు, దోమల నివారణకు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, ఫాగింగ్‌తో పాటు అన్ని పనులకు కార్మికులే ఆధారం. అయితే పంచాయతీల ఆదాయం మేరకు కార్మికులకు జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉన్నచోట, నిధులు సమృద్ధిగా ఉన్న కొన్ని జీపీల్లోనే వేతనం చెల్లింపు సక్రమంగా కొనసాగుతుంది. మిగతా జీపీల్లో పనులు చేయించుకుంటున్నారే తప్ప ప్రతినెలా జీతాలు చెల్లించడం లేదు. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో పనులు చేయడానికి కార్మికులు నిరాసక్తత చూపుతున్నారు. మరోవైపు చాలా ఏళ్లుగా జీపీల్లో పనులు చేస్తున్నా జీతాలు పెరగడం లేదని నిరుత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ఆయా గ్రామాల్లోని కార్మికులను పంచాయతీ కార్యదర్శులు బుజ్జగిస్తూ పనులు చేయిస్తున్నారు.

నిధుల కొరత..

పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో 2024 ఫిబ్రవరి 1నుంచి పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. నాటి నుంచి పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో ఇంటి పన్నులు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కార్మికుల వేతనాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లకు కొన్ని నెలలుగా పంచాయతీ కార్యదర్శులే సొంత డబ్బులతో డీజిల్‌ పోయిస్తున్నారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య, ఇతర పనుల నిర్వహణకు నిధులు లేకపోవడంతో కార్యదర్శులు అప్పులు చేయాల్సి వస్తోంది.

జిల్లాలో 2,500 మందికి పైగా కార్మికులు..

జిల్లాలో 461 జీపీలు ఉండగా.. 2,500 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో కారోబార్లు, బిల్‌కలెక్టర్లు, వాటర్‌మేన్లు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ప్రతి కార్మికుడికి రూ. 9,500 వేతనంగా నిర్ణయించినా.. కొన్ని జీపీల్లో అంతంతమాత్రంగానే వేతనాలు అందుతున్నాయి. నిధుల కొరత కారణంగా అనేక పంచాయతీల్లో వేతనాలు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. తమకు నెలనెలా వేతనాలు చెల్లించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అవసరమైతే నిరవధిక సమ్మె చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.

డిమాండ్లు ఇవే..

పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు క్రమంగా చెల్లించాలి.

ఉద్యోగ భద్రత కల్పించాలి.

రెండో పీఆర్‌సీ పరిధిలోకి పంచాయతీ సిబ్బందిని తీసుకొచ్చి జీఓ నం.60 ప్రకారం వేతనాలు చెల్లించాలి.

జీఓ నం.51ని సవరించి మల్టీపర్పస్‌ కార్మికుల విధానం రద్దు చేయాలి. పాత కేటగిరీల ప్రకారం ఉద్యోగులుగా గుర్తించాలి.

కారోబార్లు, బిల్‌ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలి.

అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు

కల్పించాలి.

పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్డ్‌మెంట్‌ బెనిఫిట్‌గా రూ. 5లక్షల చొప్పున చెల్లించాలి.

మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయంతో పాటు ఇంటి స్థలాలు కేటాయించాలి.

వేతన వ్యథ! 1
1/1

వేతన వ్యథ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement