
అపరిష్కృత సమస్యలు పరిష్కరించండి
కందనూలు: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుపటి మల్లిఖార్జున్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్‌లో జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అదే విధంగా పీఆర్పీ అమలు, పెండింగ్ డీఏలు, పదోన్నతులు, ఏకీకృత సర్వీసు, పెండింగ్ మెడికల్ బిల్లులు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం విద్యార్థుల్లో దేశభక్తి నిర్మాణం, జాతీయ భావాజాలం, సభ్యత్వ అభియాన్ వంటి అంశాలపై జిల్లా కార్యవర్గానికి ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్, వెంకట్‌రెడ్డి, సురేఖ, నాగరాజు ఉన్నారు.