
క్రీడలతో మానసికోల్లాసం : ఎస్పీ
కందనూలు: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం 1986–87 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ క్రికెట్ టోర్నీని ఎస్పీ ప్రారంభించారు. అంతకు ముందు పాఠశాలలో నిర్వహించిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 38ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న స్నేహితులంతా ఒకచోట కలుసుకొని క్రీడా పోటీలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. క్రీడలతో మానసిక ఆరోగ్యం, స్నేహభావం మరింత పెంపొందుతుందని అన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులతో కలిసి ఎస్పీ కొంతసేపు క్రికెట్ ఆడి ఉత్సాహం నింపారు. కాగా, పాఠశాలలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం పూర్వవిద్యార్థులు రూ. 20వేలు అందజేశారు. గగ్గలపల్లి ఉన్నత పాఠశాలకు రెండు క్రికెట్ కిట్స్ వితరణ చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సయ్యద్ ఫసియొద్దీన్, నాగరాజు, శివకుమార్, విక్రమ్, రవీందర్‌రావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.