
మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చి మైసమ్మ దేవతను దర్శించుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. భక్తుల సౌకర్యార్థం వనపర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కాగా, మైసమ్మ జాతరకు భక్తుల రద్దీ పెరగడంతో పెద్దకొత్తపల్లిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మైసమ్మ దేవతను 15వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రంగారావు తెలిపారు.
రెవెన్యూ మేళాకు అనూహ్య స్పందన
కందనూలు: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రెవెన్యూ మేళాకు అనూహ్య స్పందన లభించిందని కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. వివిధ సమస్యలపై పట్టణ ప్రజలు 288 దరఖాస్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు. అందులో 148 ఇంటినంబర్ కోసం, 94 ఆస్తి మార్పిడి, 27 పేరు సవరణ, 19 ట్యాక్స్ రీవిజన్ దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని మూడు రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. కాగా, రెవెన్యూ మేళాను మరో నాలుగు రోజులు పొడిగించడం జరిగిందని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
పౌరహక్కులను కాపాడాలి
నాగర్‌కర్నూల్ రూరల్: పౌరహక్కులను కాపాడేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికీ మోహర్రం పండుగ సందర్భంగా పీర్ల వద్ద అలాయ్ ఆడే పరిస్థితి లేదని అన్నారు. గ్రామాల్లో కులవివక్ష, అంటరానితనంపై అవగాహన కల్పించేందుకు అధికారులు చొరవ చూపాలని కోరారు. అదే విధంగా దళిత కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టడంతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని కోరారు. సమావేశంలో కేవీపీఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణ, అశోక్, సత్యనారాయణ, రాజు, శివ, అంబేడ్కర్ ఉన్నారు.