జాతీయ లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోండి | - | Sakshi
Sakshi News home page

జాతీయ లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోండి

Jun 11 2025 11:42 AM | Updated on Jun 11 2025 11:42 AM

జాతీయ లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోండి

జాతీయ లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోండి

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి రమాకాంత్‌ అన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ సంబంధించిన వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అని, జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకోదగిన అన్ని క్రిమినల్‌, చెక్‌బౌన్స్‌, ట్రాఫిక్‌ చలానా, ఎకై ్సజ్‌, అన్ని రకాల సివిల్‌ కేసులతోపాటు కోర్టు వరకు రాకుండా ఉన్న బ్యాంకు, చిట్‌ఫండ్‌ పెండింగ్‌లో ఉన్న కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీలు లేని తీర్పును పొంది సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణాల్లో కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులు పరిష్కరించుకోవడంతో ఇరువర్గాలు సంతోషంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

నెలాఖరు వరకు రేషన్‌ పంపిణీ

నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని రేషన్‌ కార్డుదారులు తమ రేషన్‌ తీసుకునేందుకు ఈ నెలాఖరు వరకు పొడిగించామని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా రేషన్‌ కార్డు లబ్ధిదారులకు ప్రజా పంపిణీ సన్నబియ్యం ఈ నెలలోనే మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ పంపిణీ చేస్తున్నందున ఈ నెలాఖరు వరకు తమకు కేటాయించిన బియ్యం పొందవచ్చన్నారు. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా పరిధిలో ఇప్పటికే 558 రేషన్‌ షాపులకు గాను 425 రేషన్‌ షాపులకు బియ్యం పంపిణీ చేశామని చెప్పారు.

16న వేలం పాట

బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సంవత్సరం వరకు కొబ్బరి చిప్పల సేకరణ, పూలు, పూలదండలు అమ్ముకోవడానికి హక్కుల కోసం ఈ నెల 16న వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ రంగారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 నుంచి వేలం పాట ఉంటుందని, వేలంలో పాల్గొనేవారు డిపాజిట్‌ రుసుం చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం సెల్‌ నంబర్లు 80747 76229, 79817 07326లను సంప్రదించాలని సూచించారు.

దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తుల స్వీకరణ

నాగర్‌కర్నూల్‌: రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ద్వారా జిల్లాలో దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకరణాలను మంజూరు చేస్తుందని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన దివ్యాంగులు ఈ నెల 18 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు. ప్రతి లబ్ధిదారుడికి ఒక సహాయ ఉపకరణం మాత్రమే మంజూరు చేస్తామని చెప్పారు.

పీజీ మూడో సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ 3వ సెమిస్టర్‌, ఎంసీఏ, ఎంబీఏ పరీక్ష ఫలితాలను పీయూ వీసీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ మంగళవారం విడుదల చేశారు. మొత్తం 84.83శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ కె.ప్రవీణ పేర్కొన్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని, ఏమైనా సందేహాలుంటే త్వరలో రీకౌంటింగ్‌కు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అరుంధతి, డాక్టర్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement