యూరియా బుకింగ్ యాప్‌పై అవగాహన
నాగర్‌కర్నూల్: యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల వద్ద వేచి చూడకుండా, రైతు సాగు చేసిన పంటలకు సరిపడా యూరియా సకాలంలో అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన యాప్‌పై రైతులు, డీలర్లకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయాధికారి యశ్వంత్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టబోతున్న ‘యూరియా బుకింగ్ యాప్‌శ్రీపై రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు గోపి గురువారం వీసీ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ యాప్ శనివారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. జిల్లాకేంద్రంలోని రైతువేదికలో డీఏఓ యశ్వంత్‌రావు ఏడీఏలు, వీఓలతో కలిసి పాల్గొన్నారు. వీసీ అనంతరం డీఏఓ మాట్లాడుతూ జిల్లాలో ఈ యాసంగి సీజన్‌కు గాను 56,607 టన్నుల యూరియా అవసరమని రాష్ట్ర వ్యవసాయ కార్యాలయానికి నివేదిక పంపించామన్నారు. ఈ యాప్ ద్వారా రైతు ఎక్కడి నుంచైనా తనకు వీలుగా ఉన్న డీలర్ వద్ద యూరియా బుక్ చేసుకోవచ్చన్నారు. ముందుగా రైతు ఈ యాప్‌లో తాను సాగు చేసిన పంట వివరాలు నమోదు చేస్తే అవసరమైన యూరియా కోటా చూపిస్తుందని, దీనిని రైతు ఒక్కో దఫాలో 5 బస్తాల చొప్పున బుక్ చేసుకోవచ్చన్నారు. ఒకసారి రైతు యూరియా కొనుగోలు చేశాక మళ్లీ 15 రోజుల తర్వాతనే రెండో దఫాలో యూరియా కొనుగోలు చేయడానికి వీలవుతుందన్నారు. రైతు యూరియా బుకింగ్ చేసుకున్నాక ఒక బుకింగ్ ఐడీ నంబర్ వస్తుందని, ఈ ఐడీ నంబరు, పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు తీసుకెళ్లి బుక్ చేసుకున్న మరుసటి రోజులోపు డీలరు వద్ద యూరియా తీసుకోవచ్చన్నారు. ఈ మేరకు ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలు యాప్‌పై రైతులకు అవగాహన కల్పించి బుకింగ్ చేసుకోవడంలో సహకరించాలని సూచించారు.


