నేడు డయల్ యువర్ డీఎం
కొల్లాపూర్: కొల్లాపూర్ ఆర్టీసీ డిపో పరిధిలో ప్రజా రవాణా సమస్యలపై సలహాలు, సూచనల కోసం శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఉమాశంకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆర్టీసీ ప్రయాణికులు సెల్ నం.94937 33602కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు తెలియజేయాలని ఆయన కోరారు.
రేపు లైసెన్సు,రిజిస్ట్రేషన్ మేళా
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా ఆహార పరిరక్షణ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు కిరాణ వర్తక సంఘం కార్యాలయంలో నిర్వహించే లైసెన్సు, రిజిస్ట్రేషన్ మేళాను వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నీలిమ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త రిజిస్ట్రేషన్, లైసెన్సు పొందేందుకు ఆధార్, ఫొటో, పాన్ కార్డు, కరెంట్ బిల్, ట్రేడ్ లైసెన్సు తీసుకురావాలని సూచించారు.
23న ఉచిత కంటి వైద్య శిబిరం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆప్తాలమిక్ అధికారి బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలోని గది నం.102లో కంటి వైద్య శిబిరం ఉంటుందన్నారు. రోగులకు ప్రత్యేక, సాధారణ కంటి పరీక్షలు నిర్వహించి క్యాటరాక్టు పొర గల వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు ఏనుగొండ రాంరెడ్డి కంటి ఆస్పత్రిలో చేపిస్తామన్నారు. రోగులు బీపీ, షుగర్ పరీక్షలు చేసుకుని రిపోర్టుతోపాటు ఆధార్ తీసుకురావాలని కోరారు.
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
కందనూలు: మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మహాత్మగాంధీ పేరు లేకుండా చేయాలని జాతీయ ఉపాధి హామీ పథకంను తొలగించి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా గాంధీ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తోందని దుయ్యబట్టారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా తప్పుడు కేసులు బనాయిస్తోందని పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలను దేశ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ నిరసన చేపట్టామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
● భూగర్భ విద్యుత్ కేంద్రం సొరంగం కొండపై మంటలు
● ఎల్లూరు శివారులో పెద్దపులి సంచారం
● కొండనాగులలో వ్యక్తి బలవన్మరణం
– వివరాలు 8లో..


