సమష్టి కృషితోనే ఎన్నికలు విజయవంతం
నాగర్‌కర్నూల్: జిల్లాలో అన్ని శాఖల అధికారుల సమష్టి కృషితోనే మూడు విడతల్లో కొనసాగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల పర్యవేక్షణకు కేటాయించిన ఎన్నికల పరిశీలకులకు, కలెక్టర్, ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అదనపు కలెక్టర్ దేవసహాయం, డీపీఓ శ్రీరాములు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాల్లోని 453 పంచాయతీల్లో ఎన్నికలు ఎలాంటి అవాంచనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా ముగిశాయని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన అధికారుల కృషి అభినందనీయమన్నారు. వార్డు నుంచి జిల్లాస్థాయి వరకు ఎన్నికల అధికారుల పాత్రపై కలెక్టర్ ప్రశంసించారు. భవిష్యత్‌లో నిర్వహించే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ మాట్లాడుతూ కలెక్టర్ పర్యవేక్షణలో ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇచ్చిన మార్గదర్శక సూచనలు ఎంతో దోహదపడ్డాయని చెప్పారు. భద్రతాపరంగా ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఎన్నికలను సాఫీగా నిర్వహించామని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారుల కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లు చేయడంతోపాటు సిబ్బందికి కలెక్టర్ ఆధ్వర్యంలో సమర్థవంతమైన శిక్షణ తరగతులు నిర్వహించడం వల్ల ఎన్నికలు విజయవంతం అయ్యాయని వివరించారు. కార్యక్రమంలో వ్యయ పరిశీలకులు భీమ్లానాయక్, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్, డీఎల్‌పీఓలు, ఎన్నికల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


