పాఠశాలల పనితీరు మెరుగుపరుస్తాం
నాగర్‌కర్నూల్: ఆకస్మిక తనిఖీలతో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపరిచి.. జిల్లాలో విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్క కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ, మహిళల అభ్యున్నతికి సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు, స్వయం సహాయక మహిళా సంఘాల భవనాల నిర్మాణాలు, సంఘాల్లో కోటి మంది మహిళలను చేర్చడం తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 12వ తేదీనే ప్రతి విద్యార్థికి యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు అందిస్తామన్నారు. పాఠశాలల పునఃప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూస్తామన్నారు. జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని.. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలతో పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ పూర్తి చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను నవంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా అంగన్‌వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ పెంచినట్లు వివరించారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదుల్లో విద్యార్థులను కూర్చొబెట్టకుండా చూస్తామని కలెక్టర్ తెలిపారు.
పుస్తకాలు, యూనిఫాంల
పంపిణీకి సిద్ధం
బడిఈడు పిల్లలందరినీ బడిలో
చేర్పించేందుకు చర్యలు
కలెక్టర్ బదావత్ సంతోష్


