ధాన్యం తరలింపులో జాప్యం సరికాదు
పెద్దకొత్తపల్లి: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తరలింపు వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. శనివారం మండలంలోని కల్వకోలులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి తనిఖీ చేసి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఏమైనా సమస్యలున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని.. తేమ శాతం 17 వరకు ఉన్న ధాన్యం వెంటనే తూకం చేసి లారీల్లో తరలించాలని, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. తూకం చేసే వరకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని సూచించారు. ఆయనవెంట జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింహారావు, రాజేందర్, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏపీఎం అరుణ తదితరులు ఉన్నారు.
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని.. అన్నదాతలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా టార్పాలిన్లు సమకూర్చడం, ధాన్యం తూకం చేసిన వెంటనే మిల్లులకు తరలించేలా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులకు అవసరమైన సూచనలు చేశామని పేర్కొన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 21,329 మంది రైతుల నుంచి 1,23,375 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, అందులో 63,427 మె.ట. దొడ్డు రకం, 59,948 మె.ట. సన్నరకం ఉందని వివరించారు.
ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు..
రాష్ట్ర 11వ ఆవిర్భావ వేడుకలను సోమవారం జిల్లాకేంద్రంలోని పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని.. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముఖ్యఅతిథి ప్రసంగించనున్నట్లు తెలిపారు. వేడుకల నిర్వహణ బాధ్యతలను వివిధ శాఖల అధికారులకు అప్పగించామని.. జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు.. డీపీఆర్వో సౌండ్‌సిస్టం, ఇతర సౌకర్యాలు, జిల్లా వైద్యాధికారి వైద్య సదుపాయాలు కల్పిస్తారని, అగ్నిమాపక, ఇతర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
సరిపడా లారీలు అందుబాటులో ఉంచాలి
కలెక్టర్ బదావత్ సంతోష్


