
సాగని పనులు.. పారని నీరు
రైస్‌మిల్లు యజమానితో మాట్లాడుతున్న ఆర్డీఓ సురేష్
●
నిలిచిన సింగోటం–గోపల్‌దిన్నె లింక్ కెనాల్ పనులు
సాగునీటి సమస్య తీరనుంది..
సింగోటం రిజర్వాయర్ సమీపంలోనే మా గ్రామం ఉంది. గ్రామంలోని వీరమాయిని చెరువు కింద ఆయకట్టుకు యాసంగి సీజన్‌లో సాగుకు చెరువు నీరు సరిపోక పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. సింగోటం–గోపల్‌దిన్నె లింకు కెనాల్ ద్వారా చెరువుకు నీళ్లు మళ్లిస్తే సాగునీటి సమస్యలు తీరుతాయి. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తిచేయాలి.
– సురేందర్‌రావు, ఎన్మన్‌బెట్ల గ్రామం
పాలకులు దృష్టి సారించాలి..
సింగోటం–గోపల్‌దిన్నె లింక్ కెనాల్ నిర్మాణం పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. కేఎల్‌ఐ నీటిని నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు అందిస్తామని పాలకులు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు నేటికీ సాగునీరు అందడం లేదు. లింక్ కెనాల్ పనులు పూర్తిచేస్తే కొంత మేర రైతులకు మేలు చేకూరుతుంది. ఆ దిశగా అధికారులు, పాలకులు దృష్టి సారించాలి.
– సాయికృష్ణగౌడ్, సింగోటం
● మూడేళ్ల కిందట
రూ.147.7 కోట్లు మంజూరు
● భూ సేకరణే ప్రధాన అడ్డంకి
● నిర్మాణం పూర్తయితే
34 వేల ఎకరాలకు సాగునీరు
కొల్లాపూర్: నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన సింగోటం–గోపల్‌దిన్నె లింక్ కెనాల్ పనులు ముందుకు సాగడం లేదు. భూ సేకరణ సమస్య కారణంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ కాల్వ నిర్మాణంపై ఐదు మండలాల రైతులు ఆశలు పెట్టుకున్నారు. నిర్మాణం పూర్తయితే సాగునీటి సమస్యలు తీరుతాయని భావిస్తున్నా.. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో వారి ఆశలు అడియాశలవుతున్నాయి.
మూడేళ్ల కిందట టెండర్లు పూర్తి..
జూరాల ఎడమ కాల్వ చివరి ఆయకట్టు కింద కొల్లాపూర్ నియోజకవర్గంలోని వేలాది ఎకరాల భూములున్నాయి. ఆయా ప్రాంతాల్లోని రైతులకు యాసంగి సీజన్‌లో సాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుగాను సింగోటం–గోపల్‌దిన్నె లింక్ కెనాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని మళ్లించేలా పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం గత ప్రభుత్వం మూడేళ్ల కిందట రూ.147.7 కోట్లు మంజూరు చేసి టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించింది. గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు అనుసంధానంగా 5 కిలోమీటర్ల మేర కాల్వను తవ్వారు. తర్వాత భూ సేకరణ పేరుతో పనులు నిలిచిపోయాయి.
భూ సేకరణకు చర్యలు..
వనపర్తి జిల్లా పరిధిలో 200 ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో 100 ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉండటంతో పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. గత ప్రభుత్వం పనుల పూర్తికి యత్నించినప్పటికీ పలు కారణాలతో ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి జూపల్లి కృష్ణారావు కాల్వ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించి భూ సేకరణ అంశంపై చర్చించారు. పనుల పూర్తికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రెండు జిల్లాల పరిధిలో..
సింగోటం–గోపల్‌దిన్నె లింక్ కెనాల్‌తో వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల, చిన్నంబావి మండలాలతో పాటు పాన్‌గల్ మండలంలోని కొంతమేర, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని పలు గ్రామాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. లింక్ కెనాల్‌కు తూములు ఏర్పాటుచేసి సమీపంలోని చెరువులు, కుంటలకు నీళ్లు మళ్లించేలా డిజైన్లు రూపొందించారు. కాల్వకు నీటి సరఫరా ప్రారంభమైతే జూరాల ఎడమ కాల్వ కింద ఉన్న 24,500 ఎకరాల ఆయకట్టుకు, రాజీవ్ భీమా కాల్వల కింద ఉన్న 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అదేవిధంగా వేసవిలో గోపల్‌దిన్నె రిజర్వాయర్ కింద ఉండే పలు గ్రామాలకు తాగునీటి సమస్యలు కూడా తీరుతాయి.
ఉన్నతాధికారులకు నివేదించాం..
లింక్ కెనాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు చర్యలు చేపట్టాం. గతంలో గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించాం. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పనుల పురోగతిపై చర్చించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలు తెలియజేశాం. కాల్వ పనులకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకుట పంపించాం.
– శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ

సాగని పనులు.. పారని నీరు

సాగని పనులు.. పారని నీరు

సాగని పనులు.. పారని నీరు