
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
నాగర్‌కర్నూల్: ప్రభుత్వ అనుమతి లేని బీజీ–3 నకిలీ పత్తి విత్తనాల నియంత్రణకు పోలీస్, వ్యవసాయశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా సమీకృత కార్యాలయాల సమావేశ మందిరంలో నకిలీ పత్తి విత్తనాల నియంత్రణకు ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ బృందాల సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో వరి తర్వాత ఎక్కువగా పత్తి సాగు చేస్తున్నారని.. ఈ ఏడాది 2.86 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేసినట్లు చెప్పారు. 2,865 క్వింటాళ్ల పత్తి విత్తనాలు అవసరం కాగా.. ఇప్పటికే 573 క్వింటాళ్లు సరాఫరా చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతిలేని బీజీ–3 నకిలీ పత్తి విత్తనాలు అమ్మడం, విత్తడం, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష, పీడీ యాక్టు నమోదుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బీజీ–3 పత్తి విత్తనాలు విత్తడంతో భూ సారం దెబ్బతినడమే కాకుండా వాతావరణం కలుషితమవుతుందని.. నకిలీ విత్తనాలతో పండిన పంటతో నేసిన దుస్తులు ధరిస్తే చర్మ క్యాన్సర్ వస్తుందన్నారు. మంగళవారం 24 టాస్క్‌ఫోర్స్ బృందాలు జిల్లాలోని 733 డీలర్ ఔట్‌లెట్లను తనిఖీ చేయాలని.. కాలం చెల్లిన విత్తనాలు అమ్మినా, నిల్వ ఉంచినా, అనుమతి లేని నకిలీ విత్తనాలు అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, చెక్‌పోస్టులో కూడా గట్టి నిఘా ఉంచాలని సూచించారు. ప్రభుత్వం అనుమతించిన బీటీ–2 పత్తి విత్తనాలను మాత్రమే లైసెన్సుడ్ ఔట్‌లెట్ డీలర్ల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బదావత్ సంతోష్