
అకాల వర్షాలతో రైతులకు తీవ్రనష్టం
బిజినేపల్లి: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అన్నారు. మండలంలోని లట్టుపల్లిలో వారం రోజుల క్రితం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రం నుంచి ప్రభుత్వ అధికారులు సరైన సమయంలో ధాన్యం సేకరించడంతో ఆదివారం కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన వడ్లను మ్యాచర్ పేరుతో కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. సోమవారం మండలంలోని లట్టుపల్లిలో కొనుగోలు కేంద్రం ఆవరణలో వర్షానికి తడిసిన, కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాల వర్షం కాారణంగా ఎండిన వడ్లు మళ్లీ తడవడంతో 25 నుంచి 50 శాతం వరకు నష్టం వాటిల్లిందన్నారు. కొనుగోలు కేంద్రాల సిబ్బంది, అధికారులు, ప్రభుత్వం రైతులను పలు రకాలుగా మోసం చేయడంతో వారు చేసేది లేక ప్రైవేటు మిల్లర్లకు రూ.1,800 గుండుగుత్తగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే నష్టం అంచనా వేసి రైతులకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, నారాయణచారి, భూషయ్య, రమేష్‌గౌడ్, చంద్రకళ, తిరుపతయ్య, రఘుబాబు, ఓం ప్రకాష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.