
నేటి నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు
కందనూలు: 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఓపెన్ (సార్వత్రిక) పది, ఇంటర్ పరీక్షలు ఆదివారం నుంచి 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఎనిమిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. జిల్లాకేంద్రంలో రెండు, కల్వకుర్తిలో రెండు, అచ్చంపేటలో రెండు, కొల్లాపూర్‌లో రెండు కేంద్రాలు ఉన్నాయి. పదోతరగతి, ఇంటర్‌కు వేర్వేరుగా కేంద్రాలు కేటాయించగా.. మొత్తం 1,503 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకుగాను జిల్లావ్యాప్తంగా 9 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 9 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ప్రతి సెంటర్‌కు ఒక సిట్టింగ్ స్క్వాడ్, 65 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ విద్యార్థులకు రాత పరీక్షల అనంతరం ఈ నెల 26 నుంచి మే 3 వరకు ప్రయోగ పరీక్షలు (ప్రాక్టికల్స్) నిర్వహించనున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు..
పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్, జిల్లా ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ శివప్రసాద్ శనివారం తెలిపారు. ఇప్పటికే విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు జారీ చేశామని.. కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. హాల్‌టికెట్లు పొందని వారు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కేంద్రాల్లోకి విద్యార్థులు, సిబ్బందికి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని.. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, కనీస సౌకర్యాలు కల్పించామన్నారు.
హాజరుకానున్న 1,503 మంది విద్యార్థులు
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు