
ముగిసిన ‘పది’ మూల్యాంకనం
కందనూలు: జిల్లాకేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ముగిసిందని డీఈఓ రమేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని మూల్యాంకన కేంద్రంలో చీఫ్ ఎగ్జామినర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎలాంటి అవరోధాలు లేకుండా మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసిందని, అత్యంత పారదర్శకంగా పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ నిర్వహించామన్నారు. 64 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 384 మంది సహాయ ఎగ్జామినర్లు, 130 మంది స్పెషల్ అసిస్టెంట్స్ విధులకు హాజరై 1,34,503 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారన్నారు. మూల్యాంకనం చివరిరోజు రెగ్యులర్ విద్యార్థుల పరీక్ష పేపర్లు తెలుగు 20,482, హిందీ 19,180, ఇంగ్లిష్ 11,991, గణితం 23,406, ఫిజికల్ సైన్స్ 26,100, బయోసైన్స్ 14,088, సోషల్ స్టడీస్ 17,616, ఒకేషనల్ 1,604, తెలుగు రెండో సబ్జెక్ట్ 36 పేపర్లు మూల్యాంకనం చేసినట్లు వివరించారు. ఎలాంటి పని అప్పగించినా ఉపాధ్యాయులు అంకితభావంతో పూర్తి చేసి జిల్లా విద్యా శాఖకు పేరు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. గత మూడేళ్ల నుంచి లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలను మూల్యాంకన ప్రక్రియకు అప్పగించి సహకరించిన పాఠశాల ప్రిన్సిపల్ రాజును డీఈఓ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖర్‌రావు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ కుర్మయ్య, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, ఎంఈఓ భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.