
పాల ధరల సడలింపు
విజయ డెయిరీలో పాల ధరల్లో హెచ్చుతగ్గులు
నాగర్‌కర్నూల్: జిల్లాలో పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. గతంతో పోలిస్తే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంతోపాటు పాడి పరిశ్రమ సైతం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ ద్వారా గతంలో 40 వేల లీటర్ల వరకు పాలు సేకరించగా.. ప్రస్తుతం 74 వేల వరకు పెరిగింది. అయితే ఈ ఏప్రిల్ 1 నుంచి పాల ధరలు సడలిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో గేదె పాల ధరను పెంచగా ఆవు పాలకు ధరలను తగ్గిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.
220 అవుట్‌లెట్ల ద్వారా..
జిల్లాలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో తొమ్మిది కేంద్రాలు మాత్రమే కొనసాగుతున్నాయి. జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్, కొండారెడ్డిపల్లి, అచ్చంపేట, వెల్దండ, ఊర్కొండ, మాధారం, గుండూరు, కల్వకుర్తి, కుప్పగండ్ల ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ కేంద్రాలు కొనసాగిస్తున్నారు. రూర్బన్ పథకం కింద పెద్దకొత్తపల్లిలో మండలం పెద్దకార్పాములలో ఏర్పాటు చేస్తున్న పెరుగు తయారీ కేంద్రానికి సంబంధించి పనులు పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అయితే జిల్లాలో తొమ్మిది కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా.. 220 అవుట్‌లెట్ల ద్వారా పాలు సేకరిస్తున్నారు.
జిల్లాలో పాల ఉత్పత్తి
1.70 లక్షల లీటర్లు
తగ్గించిన
ఆవు పాల ధర రూ.4.33
విజయ డెయిరీ సేకరిస్తున్న పాలు 74,000 లీటర్లు
పెంచిన గేదె పాల ధర రూ.4.50
తీవ్రంగా నష్టపోతాం..
గ్రామీణ ప్రాంతాల్లో గేదెలకు బదులు ఆవులను అధికంగా పెంచుతాం. కానీ, ప్రభుత్వం గేదెపాలకు ధర పెంచి ఆవుపాలకు తగ్గించింది. లీటరు ఆవు పాలకు గతంలో రూ.46 ఇస్తుండగా.. ప్రస్తుతం ఆ ధరను రూ.4 తగ్గించి రూ.42లకే పరిమితం చేసింది. ఫలితంగా ఆవు పాల రైతులం తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం పునరాలోచించి ఆవు పాల ధర పెంచి రైతులను ఆదుకోవాలి.
– కొండలయ్య, పాడిరైతు, గట్టునెల్లికుదురు
1 నుంచే అమల్లోకి..
విజయ డెయిరీలో సవరించిన పాల ధరలు ఈ నెల 1 నుంచే అమలులోకి వచ్చాయి. ప్రతి మూడు, నాలుగు నెలలకొకసారి సంస్థ చేపట్టే సమీక్షలో భాగంగా ధరలు హెచ్చు తగ్గులు అవుతుంటాయి. రైతులతో చర్చించే పాల ధరలను నిర్ణయిస్తారు. ఈసారి కూడా అదే కోవలో పాల ధరలను నిర్ణయించారు.
– ధన్‌రాజ్ డీడీ, పాడి పరిశ్రమ
అభివృద్ధి సహకార సమాఖ్య
ఆవు పాలకు తగ్గింపు,
గేదె పాలకు పెంపు
జిల్లాలో అత్యధికంగా ఆవు పాలే సేకరణ
తీవ్రంగా నష్టపోనున్న పాడిరైతులు

పాల ధరల సడలింపు