అచ్చంపేట రూరల్: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని, సాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి సాగు నీటి నిర్వహణ, సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్ బదావత్ సంతోష్ ఈ వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పంటలకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సాగునీటి కొరత రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, ఎక్కడా పంటలు ఎండి పోకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ బదావత్ సంతోష్ వివరిస్తూ ఇరిగేషన్, వ్యవసాయ అధికారులకు తగు సూచనలు, సలహాలు అందిస్తూ మండల వ్యవసాయ అధికారులు కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. వరిపంట సాగునీరు అందించేందుకు వేసవిని దృష్టిలో పెట్టుకొని నీరు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించామన్నారు. కాల్వలను సందర్శించాలని, నీరు వృథా కాకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. నీటి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు పొదుపుగా వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులకు సాగునీటి సరఫరాపై ముఖ్యంగా నీటి నిర్వహణ, మోటార్లకు నిరంతర విద్యుత్ సరఫరా వంటి చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నీటి కొరత రాకుండా చూడాలన్నారు.