ఏటూరునాగారం: జిల్లాలోని ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ పరిధిలో 50 గొత్తికోయ గూడేలు ఉన్నాయి. గిరిజనులు అడవుల్లో లభించే ఇప్ప పలుకలను వానాకాలం, ఎండాకాలంలో విరివిరిగా సేకరించి వాటిని నిల్వ చేసుకొని వేసవిలో విక్రయించి ఆదాయం పొందుతున్నారు. అలాగే పలుకులను ఎండబెట్టి పట్టించగా వచ్చే నూనెతో దీపారాధన చేయడం ఎంతో మంచిదని భక్తుల విశ్వాసం. ఈ ఇప్పనూనెకు మార్కెట్‌లో కిలోకు రూ.100ల నుంచి రూ.150 వరకు విక్రయించి ఆదాయం పొందుతున్నారు.
ఇప్పనూనె ఇతర ప్రాంతాలకు తరలింపు
ఏజెన్సీలోని గొత్తికోయలు సేకరించిన ఇప్పపలుకులను పలువురు వేసవిలో నూనెగా మార్చి వరంగల్, హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్, భద్రాచలం ప్రాంతాలకు తరలిస్తుంటారు. అలాగే మరికొందరు సేకరించిన పలుకులకు నూనె మిల్లుల యజమానులు కిలోకు రూ.40 నుంచి రూ.50 వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ఒక్కో కుటుంబం సుమారు 50 క్వింటాల వరకు అమ్ముతుంటుందని గొత్తికోయలు చెబుతున్నారు. ఇప్పపలుకులతో ప్రతిఏటా మంచి ఆదాయం వస్తుందని సంతోషం వెలిబుచ్చుతున్నారు.
రూ.6 వేల వరకు సంపాదిస్తా..
ఇప్పపలుకులను సేకరించి నూనెగా మార్చడం వల్ల రూ.6 వేల వరకు సంపాదిస్తాను. ఇంటికొచ్చి పలువురు నూనెను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. మరికొందరు ఇప్ప పలుకులను కూడా కొనుగోలు చేస్తుంటారు. ఇలా వచ్చిన ఆదాయంతో కావాల్సిన నిత్యావసర సరుకులు తీసుకొచ్చుకుంటాం.
– ఇర్ప లక్ష్మి, కొమురం భీంనగర్,
ఏటూరునాగారం
పలుకులు సేకరించి నిల్వచేసుకుంటున్న గొత్తికోయలు
ఉత్పత్తులకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్
కిలో నూనెకు రూ.100 నుంచి 150 పలుకుతున్న ధర
మండలం గూడేలు క్వింటాలు
ఏటూరునాగారం 6 15
ఎస్‌ఎస్ తాడ్వాయి 4 4
కన్నాయిగూడెం 4 6
మంగపేట 8 20
గోవిందరావుపేట 2 5


