● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు: యోగాతో ఆరోగ్యం, అందమైన జీవితం ఉంటుందని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాల ప్రాంగణంలో ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యోగాతో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమ శిక్షణతో కూడిన జీవన విధానం ఉంటుందని తెలిపారు. ప్రతిఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సాంకేతిక సౌకర్యాల పెరుగుదలకు కారణంగా మనిషి శారీరక శ్రమకు దూరం అవుతున్నాడని తెలిపారు. గతంలో పూర్వీకులు ప్రత్యేకంగా వ్యాయామం చేయకపోయినా శారీరక శ్రమ చేయడం వల్ల ఆరోగ్యంగా జీవించారని వెల్లడించారు. ప్రతిఒక్కరూ ప్రతిరోజూ యోగా, ఇతర శారీరక వ్యాయామాల కోసం సమయం కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, డీఎఫ్‌వో వికాష్ మీనా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, డీఈఓ సిద్ధార్థరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ సంధ్య, డీఎస్పీ రవీందర్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


