చెరువు ఆయకట్టు రైతుల నిరసన
మంగపేట: మండల పరిధిలోని బోరునర్సాపురం, చెరుపల్లి రెవెన్యూ పరిధిలోని ఉప్పల నర్సయ్య చెరువు శిఖం భూములను కొంతమంది కబ్జాచేసి బోరు బావులను నిర్మించి అక్రమంగా సాగు చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయకట్టు రైతులు ఆదివారం చెరువుకట్టపై అరగంట పాటు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయకట్టు రైతులు మాట్లాడారు. చెరువు శిఖం భూములను కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జా చేసి సాగు చేస్తున్నారని తెలిపారు. మరికొందరు ఏకంగా మత్తడిని సైతం కబ్జా చేసి అందులో బోరుబావిని నిర్మించి సాగు భూమిగా మార్చుకున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా వర్షాకాలంలో చెరువులోకి నీరు వచ్చి చేరడంతో అక్రమంగా కబ్జా చేసి శిఖం భూముల్లో సాగు సాగు చేసిన పంట నీట మునగడంతో కబ్జాదారులు చెరువు షటర్లను ధ్వంసం చేసి చెరువులోని నీటిని బయటకు వెళ్లగొట్టడంతో ప్రతిఏటా ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన ప్రతిసారి ఓ అధికారి వచ్చి చూడటం సర్వేయర్ లేరని రెవెన్యూ అధికారులతో కలిసి ఉమ్మడిగా సర్వే చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతూ దాటవేత దోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఏటూరునాగారం – బూర్గంపాడు ప్రధాన రోడ్డు వెంట వందల ఎకరాల చెరువు భూమి కబ్జాకు గురవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని రైతులు ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉప్పలనర్సయ్య చెరువుతో పాటు పక్కనే ఉన్న కోతుల కుంట చెరువు ఆనవాళ్లు లేకుండా కబ్జాకు గురైందని, మామిడికుంట చెరువు సైతం పూర్తిగా కబ్జాకు గురైందన్నారు. దీంతో పాటు మండలంలోని దాదాపు అన్ని చెరువుల పరిస్థితి ఇదే విధంగా తెలిపారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి చెరువుల్లోని శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేసి, ఆయకట్టు భూములకు సాగు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్


