ఐటీడీఏ ఏపీఓగా వసంతరావు జాదవ్‌ | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ ఏపీఓగా వసంతరావు జాదవ్‌

Jun 13 2025 4:55 AM | Updated on Jun 13 2025 2:36 PM

ఏటూరునాగారం: ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అసిస్టెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌గా వసంతరావు జాదవ్‌ గురువారం విధుల్లో చేరారు. గతంలో ఇక్కడ పనిచేసి గతేడాది బదిలీపై ఉట్నూరు ఐటీడీఏకు వెళ్లారు. ఉట్నూరులో పనిచేసే ఏపీఓ భీమ్‌రావు గతేడాది డిసెంబర్‌ 25న అనారోగ్యంతో మరణించారు. గత ఆరు నెలల నుంచి ఐటీడీఏ ఏపీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో ఐటీడీఏ అధికారుల ప్రతిపాదన మేరకు ఉట్నూరులో ఏపీఓగా పనిచేస్తున్న వసంతరావును ఏటూరునాగారం ఏపీఓగా నియమించారు. ఈ మేరకు ఆయన విధుల్లో చేరారు. మర్యాదపూర్వగా పీఓ చిత్రామిశ్రాను కలిశారు. అనంతరం ఏపీఓను సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.

సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి

ములుగు రూరల్‌: అధికారులు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రవితేజ అన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యుత్‌, తాగునీటి సౌకర్యం ప్రహరీ లేని పాఠశాలలకు ప్రహరీ నిర్మించాలన్నారు. సమయానికి స్కూల్‌ యూనిఫామ్స్‌, పుస్తకాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి, యుగంధర్‌, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

సాగు భూములకు హక్కు కల్పించాలి

వెంకటాపురం(కె): ఆదివాసీల సాగులో ఉన్న భూములకు హక్కు కల్పించాలని గొండ్వానా సంక్షేమ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్‌ అన్నారు. మండల కేంద్రంలోని కొమురంభీం కాలనీలో గొండ్వానా సంక్షేమ పరిషత్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాడగూడెంలో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూములను రక్షించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికై నా కొమురం భీమ్‌ కాలనీ ఆదివాసీల సాగు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

‘మొక్కలు నాటుదాం’

వాజేడు: మొక్కలను నాటి కాలుష్యాన్ని నివారించడం ద్వారా భావితరాలను కాపాడుకోవచ్చని ఓ ఆటోవాలా ప్రచారం చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిస్సా రాష్ట్రాలతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రచారం చేస్తూ గురువారం ములుగు జిల్లాలోకి అడుగు పెట్టాడు. మహబూబాబాద్‌ జిల్లా ఈదులపూసపల్లి దర్గా తండాకు చెందిన ఆటో అంజి మూడేళ్లుగా మొక్కలను నాటాలని ప్రచారం చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుత జీవన విధానంలో కాలుష్యం భాగా పెరిగిందని మొక్కలను పెంచి ప్రకృతిని రక్షించుకోవడం మనందరి బాధ్యతని వివరించారు. ప్రతిఒక్కరూ సంవత్సరానికి నాలుగు మొక్కలు నాటితే కాలుష్యాన్ని అరికట్టవచ్చని తెలిపారు. ఈ మేరకు ఆటోకు జాతీయ జెండా కట్టుకుని మొక్కలను తీసుకెళ్తూ ప్రచారం చేసుకుంటూ వాజేడు మండలానికి వచ్చినట్లు వివరించారు. ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో 15 జిల్లాల్లో ప్రచారం చేసినట్లు తెలిపారు.

మెడికల్‌ బోర్డును పునరుద్ధరించాలి

భూపాలపల్లి అర్బన్‌: మూడు నెలలుగా నిలిచిపోయిన సింగరేణి మెడికల్‌ బోర్డును పునరుద్ధరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టయ్య కోరారు. ఏరియాలోని యూనియన్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు నెలల నుంచి సింగరేణిలో మెడికల్‌ బోర్డు పెట్టకపోవడంతో సింగరేణి కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గతంలో మెడికల్‌ బోర్డులో జరిగిన కుంభకోణం దోపిడీ విషయంలో విచారణ పేరుతో మెడికల్‌ బోర్డు నిర్వహించకపోవడం సరైనది కాదన్నారు.

ఐటీడీఏ ఏపీఓగా వసంతరావు జాదవ్‌1
1/1

ఐటీడీఏ ఏపీఓగా వసంతరావు జాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement