నేడు జస్టిస్ పీసీ ఘోష్ పర్యటన
హన్మకొండ: కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్టు పూర్వ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ గురువారం హనుమకొండ, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ పి.ప్రావీణ్య మొక్క అందించి స్వాగతం పలికారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 10.45 గంటలకు రామప్పకు చేరుకుంటారు. రామప్పలో దైవదర్శనం చేసుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు రామప్పలో బయలుదేరి 1.30 గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి మూడు గంటలకు హైదరాబాద్ వెళ్తారు.
పది మందికి జైలు శిక్ష
వెంకటాపురం(ఎం): మద్యం తాగి వాహనాలు నడిపిన వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 10మందికి జిల్లా జడ్జి జైలు శిక్ష విధించినట్లు వెంకటాపురం ఎస్సై జక్కుల సతీష్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 22మందిని బుధవారం జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా అందులో కొంత మందికి రూ.34,500లు జరిమానా విధించడంతో పాటు 8 మందికి ఒక రోజు జైలు శిక్ష, ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష జడ్జి విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
మొక్కలు నాటిన భక్తురాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: భద్రాద్రికొత్తగూడ జిల్లాలోని సుజాత్‌నగర్ మండలానికి చెందిన భక్తురాలు దుర్గ మేడారంలో అటవీ ప్రాంతంలో బుధవారం మొక్కలు నాటారు. దుర్గ కుటుంబ సభ్యులతో కలిసి మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకున్నారు. వైల్డ్‌లైఫ్ ప్రాంతంలో 116 మొక్కలు నాటుతామని అమ్మవార్లకు మొక్కుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటి మొక్కు తీర్చుకున్నారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు అడవుల సంరక్షణకు మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. దుర్గ కుటుంబ సభ్యులను రేంజ్ అధికారి నరేందర్‌తో పాటు సిబ్బంది అభినందించారు.
పాండవుల గుట్టలు అద్భుతం
రేగొండ: పాండవుల గుట్టలు అద్భుతంగా ఉన్నాయని ట్రెయినీ కలెక్టర్లు అన్నారు. బుధవారం మండలంలోని రావులపల్లి శివారులోని పాండవుల గుట్టలను 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ల బృందం సౌరభ్‌శర్మ, సలోని చబ్ర, హర్ష చౌదరి, ప్రణయ్ కుమార్, కరోలిన్ చింగ్తాయిన్మావిలు సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా వారు గుట్టలోని కుంతీదేవి, కొలనుకుంటా, పాండవుల కాలం నాటి రాతి చిత్రాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాండవుల గుట్టలు అతి సుందరమైనవని, మహాభారత కాలం నాటి చారిత్రాక ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయన్నారు. వారి వెంట తహసీల్దార్ శ్వేత, జిల్లా యువజన, క్రీడాల శాఖ అధికారి రఘు, కోర్సు డైరెక్టర్ కందుకూరి ఉషారాణి, నోడల్ అధికారి శ్రీనివాస్, ఎఫ్‌ఎస్‌ఓ గౌతమి, ట్రెయినీ ఎస్సై దివ్య, ఆర్‌ఐ భరత్‌రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు.
పోల్‌టాక్స్‌ను రద్దు చేయాలి
భూపాలపల్లి అర్బన్: కేబుల్ ఆపరేటర్లపై రాష్ట్ర ప్రభుత్వం భారం మోపుతున్న పోల్ టాక్స్‌ను వెంటనే రద్దు చేయాలని ఇండిపెండెంట్ ఎంఎస్‌ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేశాల రమేశ్‌బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై బుధవారం జి ల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్‌క్లబ్‌లో కేబుల్ ఆపరేటర్లతో కలిసి మాట్లాడారు. గత 30 ఏళ్లుగా ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకు న్న స్వయంకృషితో కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజలకు వినోదాన్ని అందించడమే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు సంబంధించిన సమాచారం అందించడంలో కే బుల్ ఆపరేటర్లు ముందు వరుసలో ఉంటున్నారన్నారు. ప్రస్తుత సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్‌లతో పోటీ పడడం కష్టమవుతుందన్నారు. ఇప్పటికే నష్టాల్లో నడుపుతున్న కేబుల్ ఆపరేటర్లపై భారం మోపడం సరికాదన్నారు. వెంటనే అధికారులు ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు.
నేడు జస్టిస్ పీసీ ఘోష్ పర్యటన
నేడు జస్టిస్ పీసీ ఘోష్ పర్యటన


