విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ములుగురూరల్: వైద్యాధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు అన్నారు. మండల పరిఽధిలోని రాయినిగూడెం, పత్తిపల్లి, మధనపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ రానున్న వర్షాకాలం సీజన్‌లో వచ్చే మలేరియా, డెంగీ వ్యాధుల నియంత్రణలో ఆరోగ్య సిబ్బంది ముఖ్య పాత్ర పోషించాలన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని సమన్వయం చేసుకుని డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీటి గుంటల్లో నీరు నిల్వ ఉంటే వాటిలో ఆయిల్‌బాల్స్ వేయాలన్నారు. తాగునీటిని క్లోరినేషన్ చేయాలని సూచించారు. సిబ్బంది గ్రామాల్లోని ఇంటింటిని సందర్శించి లార్వా కంటైనర్లను తొలగించాలని ఆశ కార్యకర్తలకు సూచించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో మూడు నెలల పాటు మందులు నిల్వ ఉంచుకోవాలన్నారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించి సకాలంలో షెడ్యూల్ ప్రకారం చిన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని తెలిపారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాయలంలో రాష్ట్రీయ బాల స్వస్తియా కార్యక్రమంలో పని చేసే వైద్యులకు, ఫార్మసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సీజన్‌లో వచ్చే వ్యాధుల నియంత్రణలో ఆరోగ్య శిబిరాల నిర్వహణ, ఆశ్రమ పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాలలో పిల్లలకు ఐ స్కానింగ్ ఈ నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ ప్రొవైడర్ రవళిదీప్తి, ఆరోగ్య కార్యకర్తలు ఉపేంద్ర, కల్పన, భాస్కర్, జిల్లా ఉప ఆరోగ్యశాఖ అధికారి విపిన్ కుమార్, ఆర్‌బీఎస్‌కే జిల్లా పోగ్రాం అధికారి రణధీర్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు


