
ముహూర్తం ప్రకారం 5.44 గంటలకు..
జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలను వేదపండితులు శాస్త్రోకంగా గణపతిపూజతో ప్రారంభించారు. గురువారం తెల్లవారుజామున 5.44గంటలకు కాళేశ్వరంలోని సరస్వతిఘాటుకు చేరుకొని ముహూర్తం ప్రకారం గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదికి విశేష పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన పీఠాధిపతి మాధవానందసరస్వతిస్వామి ముందుగా పుష్కరునికి ఆహ్వాన పూజ చేశారు. పండితులు సరస్వతిమాతకు పూలు, పండ్లు, పాలు, చీరసారెతో నైవేద్యం సమర్పించారు. మాధవా నందసరస్వతిస్వామి పుష్కరినిలో స్నానం ఆచరించి ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, దేవాదాయ కమిషనర్ వెంకట్‌రావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఆర్జేసీ రామకృష్ణారావు, ఈఓ మహేశ పుష్కర ప్రారంభ స్నానాలు ఆచరించారు. అనంతరం వేదపండితులు ఐదు కలశాలలో గోదావరి జలాలను తీసుకుచ్చి శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామికి అభిషేక పూజలు చేశారు.