
వడదెబ్బపై అవగాహన కల్పించాలి
ములుగు: వేసవిలో ఎదురయ్యే వడదెబ్బపై విద్యార్థులు, కూలీలకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులతో కలిసి వైద్యవిద్య, వ్యవసాయశాఖ, ఎంపీడీఓలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులను వెళ్తున్న కూలీలకు పని ప్రదేశంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడా చిన్న సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వడదెబ్బకు గురైన వ్యక్తికి సకాలంలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బడీడు పిల్లలను ఎట్టి పరిస్థితిలో బయటికి పంపవద్దని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకరావాలని తెలిపారు. వేసివి ముగిసేంత వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కూలీలు వడదెబ్బకు గురైతే వెంటనే 108 సిబ్బందిని సంప్రదించి ఆస్పత్రికి తరలించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం 11గంటల వరకు పనులు ముగించుకునేలా కూలీలకు సూచనలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, డీపీఓ దేవ్‌రాజ్, డీఈఓ పాణిని, జిల్లా ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు, ఎన్పీడీసీఎల్ డీఈ నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రహరీ, వెలివేషన్, పేయింటింగ్, గ్రీనరీ, భవన సుందరీకరణ పనులను పూర్తిచేయాలని సూచించారు.
అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలి
వాజేడు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం మండలస్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులను గుర్తించి అందజేయాలన్నారు. ప్రత్యేకంగా ఎంపీడీఓ, ఎంపీఓలు చొరవ చూపాలని ఆదేశించారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం మండల పరిధిలోని టేకులగూడెం వెళ్లిన కలెక్టర్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలపై లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. మండల కేంద్రానికి కలెక్టర్ దివాకర వచ్చిన సందర్భంగా ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పలు సమస్యలపై వినతులు అందజేశారు.
కలెక్టర్ టీఎస్.దివాకర

వడదెబ్బపై అవగాహన కల్పించాలి