
గ్రంథాలయాన్ని పరిశీలిస్తున్న గోవింద్‌నాయక్
వెంకటాపురం(కె)/వాజేడు: వెంకటాపురం(కె), వాజేడు మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలకు నూతన భవనాలు మంజూరు అయినట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవింద్ నాయక్ తెలిపారు. వెంకటాపురం(కె) మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. గ్రంథాలయ భవనం శిథిలావస్థలో ఉండడంతో కొత్త భవనం నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.15 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను తెప్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం జెడ్పీటీసీ పాయం రమణ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంపా రాంబాబ, నాయకులు వేల్పూరి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా వాజేడు మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు రామ కృష్ణారెడ్డి, మల్ల య్య, సాంబశివరావు, నిజాముద్దీన్, సతీష్ ఆయనను కలిసి గ్రంథాలయానికి నూతన భవనం కావాలని కోరారు. దీనికి స్పందించిన గోవింద్‌నాయక్ భవనం మంజూరు అయిందని త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణానికి గతంలో కేటాయించిన స్థల వివరాలను తహసీల్దార్ లక్ష్మణ్ నుంచి తీసుకున్నారు.