
సరిహద్దుల సమస్యలు పరిష్కరించాలి
ములుగు రూరల్: భూభారతి పైలట్ ప్రాజెక్ట్‌లో సరిహద్దుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని సీపీఐ జిల్లా సమితి సభ్యులు ముత్యాల రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) మహేందర్‌జీకి బుధవారం ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ వెంకటాపురం(ఎం) మండలాన్ని భూభారతి పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రకటించడం హర్షనీయమన్నారు. కానీ సరిహద్దు సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహిస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. వెంటనే అధికారులు స్పందించి లింగాపూర్ వద్ద గల భూములపై ఉమ్మడి సర్వే చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కంకాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రహదారి నిర్మాణ పనులపై ఎమ్మెల్యేకు వినతి
వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు, ధర్మవరం గ్రామాల మధ్యన నిలిచిపోయిన రహదారి పనులను పూర్తి చేయించాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఆయా గ్రామాల ప్రజలు భద్రాచలం వెళ్లి వినతిపత్రం అందజేశారు. అటవీశాఖ అనుమతులు రావాలని చెబుతూ అధికారులు కాలయాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. స్పందించిన ఆయన ములుగు కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకుని రహదారి పనులు పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో గౌరారపు సర్వేశ్వరరావు, నల్లగాసి రమేష్, బంధం కృష్ణ, నూకల రవి ఉన్నారు.
జిల్లా ఉద్యానశాఖ అధికారిగా సంజీవ్‌రావు
ములుగు: జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారిగా సంజీవ్‌రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టరేట్‌లో కలెక్టర్ దివాకరకు ఆయన పూల మొక్కను అందించి మర్యాద పూర్వకంగా కలిశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి బదిలీపై వచ్చిన సంజీవ్‌రావుకు కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ జిల్లా అధికారిగా విధులు నిర్వహించిన అనసూయ హనుమకొండకు బదిలీ అయ్యారు.
బోర్‌వెల్ వాహనం సీజ్
కన్నాయిగూడెం: మండల పరిధిలోని గంగూడెం గ్రామ పరిధిలోని పోడు భూమిలో బోరు వేస్తున్న బోర్‌వెల్ వాహనాన్ని సీజ్ చేసినట్లు సౌత్ జోన్ రేంజ్ అధికారి అప్సర్ నిషా తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..గంగూడెంలో మంగళవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా బోరు వేస్తున్నారనే సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి వాహనం సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆ వాహనాన్ని ఏటూరునాగారం రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు వెల్లడించారు.
‘సదస్సును
విజయవంతం చేయాలి’
ములుగు: ఈ నెల 24న కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఉమ్మడి వరంగల్ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నేత, ఉమ్మడి వరంగల్ ఇన్‌చార్జ్ మంద కుమార్‌మాదిగ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి శ్యాంబాబు అధ్యక్షతన నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో అనుబంధ సంఘాల భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో ఎంఎస్పీ జాతీయ నాయకుడు పైడిమాదిగ, వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కార్తీక్ పాల్గొన్నారు.

సరిహద్దుల సమస్యలు పరిష్కరించాలి

సరిహద్దుల సమస్యలు పరిష్కరించాలి

సరిహద్దుల సమస్యలు పరిష్కరించాలి