
మూడు నెలల ముందే అభివృద్ధి పనులు పూర్తి
ఏటూరునాగారం: 2026లో రాబోయే మేడారం మహాజాతరకు మూడు నెలల ముందుగానే అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో మేడారం జాతర అభివృద్ధి పనులు, పూజా విధానం, తదితర అంశాలపై కలెక్టర్ బుధవారం పూజారులతో సమీక్షించారు. 2026 మేడారం జాతర అభివృద్ధి పనులపై పూజారుల సూచనలు, సలహాలను కలెక్టర్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారంలో పూజారులు సమస్యలను ముందస్తుగా గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. రోడ్ల సమస్యలు ఉంటే తెలపాలని కలెక్టర్ పూజారులను కోరగా కన్నెపల్లి నుంచి కాల్వపల్లి వరకు ఉన్న ఎడ్లబండ్ల రోడ్లను అభివృద్ధి చేస్తే వాహనాలకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. అలాగే కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మను తెచ్చే దారిలో షాపులను రోడ్డుకు దూరంగా ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని వివరించారు. వ్యాపారులు తాగునీటి బాటిళ్లను అధిక ధరలకు విక్రయించడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అందుకు పూజారులతో ఓ కమిటీని వేసి ధరల నియంత్రణ చేపడుదామని వివరించారు. కొబ్బరి, బెల్లం లైసెన్సుల జారీ ప్రక్రియను జాతరకు నెల రోజుల ముందే పూర్తి చేయాలన్నారు. అధికారులు గుర్తించి అభివృద్ధి పనులకు అనుమతులు ముందస్తుగా ఇవ్వాలని పూజారులు సూచించారు. గుడి ఆవరణలో పూజా విధానాన్ని సమర్థవంతంగా పూజారులు నిర్వహించుకోవాలని, జాతర విజయవంతానికి అధికారులు పూర్తి బాధ్యత వహిస్తారని కలెక్టర్ తెలిపారు. పూజారులు గద్దెల నుంచి బయటకు, లోనికి వెళ్లే క్రమంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే పోలీసులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇందు కోసం పోలీసులు, పూజారులు, అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసి ఐడీ కార్డులను జారీ చేయాలన్నారు. రాబోయే మేడారం జాతర విజయవంతానికి గతంలో జరిగిన లోటుపాట్లను పూజారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఎండోమెంట్ అధికారులు క్రాంతి, రాజేందర్, రాజేశ్వర్‌రావు, ఏఓ రాజ్‌కుమార్‌లతోపాటు పూజారులు సిద్దబోయిన మునేందర్, కాక సారయ్య, కాక వెంకటేశ్వర్లు, చందా రఘుపతి, దబ్బగట్ల గోవర్ధన్, పెనక ప్రబాకర్, పెనక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
2026 మేడారం మహాజాతర
పనులపై పూజారులతో కలెక్టర్ సమీక్ష