
మాట్లాడుతున్న రాజయ్య, పక్కన ఎమ్మెల్యే సీతక్క
ములుగు: దేశ సంపదను అదానీకి అప్పగిస్తూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం వేసిన అనర్హత వేటు అప్రజాస్వామికం అన్నారు. అదాని ఆస్తులపై ప్రశ్నిస్తే బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాటవేస్తూ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సిగ్గు చేటన్నారు. మోదీ ప్రభుత్వం ఉన్న చోట ఈడీ, సీబీఐ ఉండదని తెలిపారు. ఇతర పార్టీల ప్రభుత్వాలు ఉన్న చోట మాత్రమే సీబీఐ, ఐటీ దాడులు చేపిస్తుందని విమర్శించారు. 2014 కంటే ముందు అదాని ప్రపంచ కుబేరుల జాబితాలో 609 స్థానంలో ఉంటే ప్రస్తుతం రెండు, మూడు స్థానాలకు ఎగబాకి దేశాన్ని లూటీ చేసిన పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన మోదీకి దేశ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీజేపీ పాలనకు చరమ గీతం పాడి రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటుపై ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, టీపీసీసీ సభ్యులు మల్లాడి రాంరెడ్డి, కిసాన్ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నొజు సూర్య నారాయణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకుతోట చంద్రమౌళి, బండి శ్రీనివాస్, సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ రాజయ్య, ఎమ్మెల్యే సీతక్క