
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న ఏటూరునాగారం అటవి ప్రాంతం ఒకవైపు కరీంనగర్, ఖమ్మం జిల్లాలను కలుపుకుని ఉంది. అలాంటి అభయారణ్యంలో వన్యప్రాణుల వేట ఆగడం లేదు. వేటగాళ్ల ఉచ్చులు, బాణాలకు పలు మూగజీవాలు బలైపోతున్నాయి. అభయారణ్యంలో ఒకప్పుడు కుందేళ్లు, పులులు, జింకలు, చిరుతలు, దుప్పులు, ఎలుగుబంట్లు, అటవిదున్నలు అత్యధిక సంఖ్యలో ఉండేవి. అడవుల అభివృద్ధికి ప్రభుత్వం పూర్వ వైభవంగా తీసుకువస్తున్నా జంతువులను వేటాడడం మాత్రం ఆగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఉచ్చులు, బాణాలతో..
వేసవి కాలంలో అడవిలో చెట్ల ఆకులు రాలిపోవడంతో పాటు వాగులు, వంకల్లో నీరు అడుగంటి పోవడంతో తాగునీటి కోసం జంతువులు సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో వేటగాళ్లు తాగునీటి కోసం అడవి జంతువులు వచ్చే ప్రాంతాలను గుర్తించి ఉచ్చులతో పాటు విద్యుత్ తీగలను అమర్చుతున్నారు. దీంతో తాగునీటి కోసం వచ్చే జంతువులు ఉచ్చులు, విద్యుత్ షాక్‌తో మృత్యువాత పడుతున్నాయి. అదే విధంగా పలువురు బాణాలతో సైతం మూగజీవాలను వేటాడుతున్నారు. ఇటీవల బాణం గుచ్చుకున్న తిరుగుతున్న ఓ దుప్పి అటవీ అధికారులకు దొరకడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతిఏటా వేసవిలో పదుల సంఖ్యలో దుప్పులు, జింకలు, కుందేళ్లతో పాటు పలు అడవి జంతువులను వేటగాళ్లు హతమారుస్తున్నారు.
కేసులేవి..
అటవీ జంతువులను వేటాడుతున్న వారిపై కేసులు పెట్టకపోవడంతో వేటగాళ్లు జంతువులను హతమార్చడం వృత్తిగా మార్చుకున్నారు. అటవీ జంతువుల మాంసం విక్రయాలు వ్యాపారంగా చేసుకుని మార్కెట్లో కిలో రూ.600 విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ములుగు జిల్లా పర్యాటక ప్రాంతం కావడంతో ఏటూరునాగారం, తాడ్వాయి అడవుల్లోని పర్యాటక ప్రాంతాలను, అటవీ జంతువులను చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. మూడునాలుగేళ్ల క్రితం అధికారులు జూపార్కు నుంచి తీసుకువచ్చి అడవిలో పర్యాటకుల కోసం దుప్పులు, జింకలను వదిలారు. దుప్పులు ఆయా గ్రామాల సమీపంలోకి, రోడ్లపై సంచరించడంతో వేటగాళ్ల చేతుల్లో బలైపోయాయి. అడవి నుంచి కట్టెలు కూడా తీసుకురానియని అధికారులు వేటగాళ్లు జంతువులను వేటాడుతున్న పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి వన్యప్రాణుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని వన ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల చర్యలు శూన్యం
అటవీ జంతువులను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడవుల సంరక్షణకు ప్రభుత్వం రేంజ్ పరిధిలో రేంజ్ అధికారితో పాటు ఐదుగురు సెక్షన్ ఆఫీసర్లు, పదుల సంఖ్యలో బీట్ ఆఫీసర్లతో పాటు సిబ్బందిని నియమించింది. సంబంధిత అధికారులు అడవుల్లోనే తిరుగుతున్నా అటవీ జంతువులను కాపాడ లేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జంతువుల తాగునీటి కోసం అధికారులు అడవుల్లో కాల్వలు, కుంటలు నిర్మించినా ఫలితం లేకుండా పోతున్న పరిస్థితి ఉంది. గతంలో అడవుల్లో సాసర పిట్లు ఏర్పాటు చేసి నీళ్లు పోసేది. ప్రస్తుతం అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని వన ప్రేమికులు ఆరోపిస్తున్నారు. జంతువుల సంరక్షణపై అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అభయారణ్యంలో అంతరించి పోతున్న వన్యప్రాణులు
వేటగాళ్ల ఉచ్చులు, బాణాలకు
మూగజీవాలు బలి
పట్టించుకోని అటవీశాఖ అధికారులు

బాణం తాకి గాయమైన దుప్పికి చేస్తున్న వైద్యం