నేటి నుంచి శ్రీరామ నవమి ఉత్సవాలు

- - Sakshi

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయం అనుబంధ దేవాలయం శ్రీరామాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని బుధవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం రాత్రి 8గంటలకు స్వామివారి ఎదురుకోలు సేవ కార్యక్రమం నిర్వహిస్తారు. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా ఉదయం 10.05గంటలకు శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.

129 మంది

విద్యార్థులు గైర్హాజరు

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షకు 129 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి దేవరాజం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నిర్వహించిన రసాయనశ్రాస్తం, వాణిజ్యశాస్త్రం, ఒకేషనల్‌ పేపర్‌ పరీక్షలకు 1,776 మంది విద్యార్థులకు గాను 1,647 హాజరైనట్లు వివరించారు.

ఆజాంనగర్‌లో

పోషణ్‌ పక్వాడా..

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి మండల పరిధిలోని ఆజాంనగర్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్‌ అధ్వర్యంలో మంగళవారం పోషణ్‌ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రాజేశ్వరి హాజరై ఆహారం, అలవాట్లు, చిరుధాన్యాల ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులకు రక్త పరీక్షలు చేయించి రక్తహీనతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ గోవిందుల రాజమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు లక్ష్మి, స్వప్న, రవళి, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌

భూపాలపల్లి: ఉద్యోగార్ధులు ధ్రువపత్రాలు పొందే విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌(ప్రిలిమినరీ) పరీక్షలు రాయబోయే ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(ఈడబ్ల్యూఎస్‌), ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు ధ్రువపత్రాలు పొందేందుకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదా సీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ని నేరుగా గాని ఫోన్‌ నంబర్‌ 7995005022లో గాని సంప్రదించాలని పేర్కొన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిశీలించి సకాలంలో సర్టిఫికెట్లు అందిస్తామని కలెక్టర్‌ వెల్లడించారు.

గడువు పెంచాలి

చిట్యాల: ఆయుస్మాన్‌ భారత్‌ పథకంలో పేర్ల నమోదు గడువు ఈ నెల 31 తో ముగుస్తున్నందున చాలా మంది పేద ప్రజలు ఇంకా నమోదు చేసుకోలేదని గడువు పెంచాలని అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రేషన్‌కార్డు లేని వారికి కూడా ప్రభుత్వం ఆధార్‌ కార్డుతో పథకం వర్తింపజేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్‌ కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ రూ.5లక్షల వరకు వైద్య చికిత్సలు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కనకం రాములు, గిన్నారపు ఓదేలు పాల్గొన్నారు.

Read latest Mulugu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top