Ricky Kej: మూడోసారి అవార్డు.. భారత్‌కు అవార్డు అంకితమంటూ భావోద్వేగం

Who Is Music Composer Ricky Kej, Know 5 Interesting Facts About Him In Telugu - Sakshi

సంగీత ప్రపంచంలో ప్రతిష్టాత్మంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో భారత్‌కు చెందిన మ్యూజిక్‌ కంపోజర్‌ రిక్కీ కేజ్‌ తన సత్తా చాటాడు. ఇప్పటికే రెండు సార్లు గ్రామీ పురస్కారాలను అందుకున్న ఆయన తాజాగా మరోసారి అవార్డును ఎగరేసుకుపోయారు. బెస్ట్‌ ఇమ్మర్సివ్‌ ఆడియో ఆల్బమ్‌ కేటగిరీలో 'డివైన్‌ టైడ్స్‌'కు గానూ గ్రామీ అవార్డు పొందారు. ఈ పురస్కారాన్ని డివైన్‌ టైడ్స్‌కు పనిచేసిన డ్రమ్మర్‌ స్టీవార్ట్‌ కోప్‌ల్యాండ్‌తో షేర్‌ చేసుకున్నారు. కాగా మూడు గ్రామీ అవార్డులు సాధించిన ఏకైక భారతీయుడిగా రిక్కీ రికార్డు నెలకొల్పారు.

ఈ సంతోషకర క్షణాలను ట్విటర్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు రిక్కీ. 'మూడో గ్రామీ అవార్డు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మాటలు రావడం లేదు. ఈ పురస్కారాన్ని భారత్‌కు అంకితమిస్తున్నా' అని ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ రిక్కీకి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇకపోతే ఇమ్మర్సివ్‌ ఆడియో ఆల్బమ్‌ కేటగిరీలో క్రిస్టినా, నిదరోస్‌డోమెన్స్‌ జెన్‌టెకర్‌, ట్రోండ్‌ హెమ్సోలిస్టెన్‌, ద చైన్‌స్మోకర్స్‌, జేన్‌ ఐరాబ్లూమ్‌ బ్యాండ్‌ట్రూప్స్‌ పోటీపడ్డాయి. కానీ వీటన్నింటిని వెనక్కు నెట్టి కేజ్‌ విజయ బావుటా ఎగురవేశారు.

ఎవరీ రిక్కీ కేజ్‌
అమెరికా ఉత్తర కెరోలినాలో 1981లో భారతీయ దంపతులకు రిక్కీ కేజ్‌ జన్మించారు. 8 ఏళ్ల వయసులోనే వారు స్వదేశానికి వచ్చి బెంగళూరులో సెటిలయ్యారు. బెంగళూరులోని ఆక్స్‌ఫర్డ్‌ డెంటల్‌ కాలేజీలో రిక్కీ కేజ్‌ డిగ్రీ పూర్తి చేశారు.  2015లో మొదటిసారి గ్రామీ అవార్డు పొందారు. బెస్ట్‌ న్యూ ఏజ్‌ ఆల్బమ్‌ కేటగిరీలో విండ్స్‌ ఆఫ్‌ సంసారాకు ఈ పురస్కారం పొందారు. 2022లో ఇదే కేటగిరీలో డివైన్‌ టైడ్స్‌కుగానూ అవార్డు అందుకున్నారు. తాజాగా డివైన్‌ టైడ్స్‌కు మరోసారి అవార్డు అందుకోవడం విశేషం. ఇకపోతే చిన్న వయసులోనే గ్రామీ అవార్డు పొందిన భారతీయ వ్యక్తిగా అందరి దృష్టి ఆకర్షించారు రిక్కీ కేజ్‌.

చదవండి: సార్‌ ఆడియో లాంచ్‌.. స్టేజీపై పాట పాడిన ధనుష్‌

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top