విజయే సీఎం.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్‌! | VTV Ganesh FIrst Guess Vijay Will Be Next CM Of Tamil Nadu | Sakshi
Sakshi News home page

విజయే సీఎం.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్‌

May 5 2026 2:14 PM | Updated on May 5 2026 2:20 PM

VTV Ganesh FIrst Guess Vijay Will Be Next CM Of Tamil Nadu

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్‌ తమిళ వెట్రి కళగం(టీవీకే)పార్టీ విజయ ఢంకా మోగించింది. విజయ్‌ ‘విజిల్‌’ మోతకు రాష్ట్రమే కాదు దేశమంతా షాకయింది. ఒంటరిగానే బరిలోకి దిగి 234 స్థానాలకు గాను 108 చోట్ల విజయం సాధించాడు. పార్టీ ఏర్పాటైన రెండేళ్లలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగి..సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే విజయ్‌ విక్టరీని ఎగ్జిట్‌ పోల్స్‌ సైతం అంచనా వేయలేకపోయాయి. కానీ ఓ నటుడు ఎన్నికల రోజే విజయ్‌ విజయాన్ని ఖాయం చేశాడు. తమిళనాడుకు కాబోయే సీఎం విజయే అని ఓటేసిన రోజే చెప్పాడు. అతనెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన తమిళ నటుడు వీటీవీ గణేష్‌.

విజయే సీఎం..
ఏప్రిల్‌ 23న తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న గణేష్‌.. అనంతరం మీడయాతో మాట్లాడుతూ..  తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్‌ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్‌ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్‌గ్రేడ్ చేయడానికి విజయ్ పర్‌ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను.

టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్‌..
వీటీవీ గణేష్‌ చెప్పినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయం సాధించింది. విజయ్‌ పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించాడు. దీంతో గణేష్‌ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్‌గా మారాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ సైతం అంచనా వేయలేదు కానీ.. సినీ నటుడు ముందే చెప్పాడని నెట్జిన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్‌’ అంటూ ఓ సినిమాలో గణేష్‌ చెప్పిన డైలాగ్స్‌ని కోట్‌ చేస్తూ ఆ వీడియోని వైరల్‌ చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement