హీరోయిన్‌ యాక్షన్‌ | Upcoming Lady Oriented Movies updates from Tollywood | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ యాక్షన్‌

May 3 2026 12:59 AM | Updated on May 3 2026 12:59 AM

Upcoming Lady Oriented Movies updates from Tollywood

‘హీరోయిన్లు అంటే హీరోల సరసన ఆడి  పాడేందుకే పరిమితం’ అనే మాట ఇటు చిత్ర పరిశ్రమలో, అటు ప్రేక్షకుల్లో వినిపించేది. అయితే.. ఇదంతా గతం. ప్రస్తుతం మాత్రం ఏ విషయంలోనూ తాము తక్కువ కాదు అంటూ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్నారు పలువురు హీరోయిన్లు. పోలీస్, లాయర్, గృహిణి... ఇలా  పాత్ర ఏదైనా బిగ్‌ స్క్రీన్‌పై తమదైన నటన చూపించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రత్యేకించి యాక్షన్‌ సన్నివేశాలకు కూడా సై అంటున్నారు. రిస్కీ సన్నివేశాలకు కూడా నో చెప్పడం లేదు. ప్రస్తుతం సమంత, రష్మిక మందన్నా, కాజల్‌ అగర్వాల్, సంయుక్త, కీర్తీ సురేష్, కామాక్షి భాస్కర్ల... వంటి పలువురు హీరో యిన్లు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ చేస్తున్నారు. ఆ విశేషాలు చూద్దాం.  

వినోదం... సందేశం  
తేజ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ‘లక్ష్మీకళ్యాణం’ (2007) సినిమా ద్వారా తెలుగులో పరిచయం అయ్యారు కాజల్‌ అగర్వాల్‌. ఆ తర్వాత చిరంజీవి, పవన్‌ కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, రవితేజ, ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌... వంటి పలువురు స్టార్‌ హీరోలతో వరుస సినిమాలు చేసి, తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారామె. ప్రస్తుతం తెలుగులో ఆమె ఏ సినిమాలోనూ నటించడం లేదు. అయితే ఇతర భాషల్లో బిజీగా ఉన్నారు. ఆమె ప్రధాన  పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ‘స్లో  పాయిజన్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌’ అనేది క్యాప్షన్. డీకే చేతన్ దర్శకత్వం వహించారు. సాగర్‌ బి. షిండే నిర్మించిన ఈ హిందీ సినిమా జూలై 24న రిలీజ్‌ కానుంది.

జీ స్టూడియోస్‌ సంస్థ ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే సమకాలీన అంశంతో రూపొందిన  ఈ గ్రిప్పింగ్‌ సోషియో–నేషనల్‌ డ్రామా మూవీలో కాజల్‌ అగర్వాల్‌ లాయర్‌  పాత్రలో నటించారు. ‘‘కెమికల్స్‌ దుర్వినియోగం, సాగులో పురుగు మందులు మితిమీరిన వినియోగం, దీని వెనుక ఉన్న భారీ కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుంది. నేటి ప్రేక్షకులు కంటెంట్‌ ఉన్న సినిమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కోవలోనే మా ‘ది ఇండియా స్టోరీ’ కూడా ఉంటుంది.

బలమైన సందేశం, ఆలోచింపజేసే స్క్రీన్ప్లే, స్టార్‌ నటీనటుల పెర్ఫార్మెన్స్ తో వస్తున్న మా మూవీ బాక్సాఫీస్‌ వద్ద తన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సినిమాలో కాజల్‌ ధైర్యవంతురాలైన న్యాయవాది  పాత్రలో కనిపిస్తారు. కంపెనీల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బయటపెట్టే  పాత్రను ఆమె పోషించారు. వినోదంతో  పాటు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించాలనే ఆలోచనతో రూపొందిన ఈ చిత్రం బలమైన కథ, భావోద్వేగభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.  

ఫ్యామిలీ డ్రామా  
ఓ వైపు హీరోయిన్‌గా, నిర్మాతగా, మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు సమంత. ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల తర్వాత ఆమె నటించిన మరో ఉమన్ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘మా ఇంటి బంగారం’. ఈ చిత్రానికి బీవీ నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ‘ఓ బేబి’ (2023) వంటి హిట్‌ మూవీ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన రెండవ సినిమా ఇది. ఇందులో గౌతమి, శ్రీలక్ష్మి, దిగ్నాథ్, ఆనంద్, గుల్షన్‌ దేవయ్య, శ్రీముఖి, శ్రీనివాస్‌ గవిరెడ్డి, మంజూష ఇతర  పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని  హిమాంక్‌ దువ్వూరుతో కలిసి తమ సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సమంత, ఆమె భర్త రాజ్‌ నిడిమోరు నిర్మించారు.

ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సమంత లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ప్రత్యేకించి ఈ మూవీలో సమంత యాక్షన్‌ సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.          ‘‘ఫ్యామిలీ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఇందులో డిఫరెంట్‌ ఎమోషన్స్ , గ్రిప్పింగ్‌ స్టోరీ ఉండనున్నాయి. రా, హై ఇం పాక్ట్‌ యాక్షన్తో భారతీయ శైలిని మిక్స్‌ చేసిన సమంత  పాత్ర ప్రేక్షకులకు సరికొత్తగా ఉంటుంది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన ‘తస్సాదియ్యా...’  పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ  పాటకు రెహమాన్‌ సాహిత్యాన్ని అందించగా, చిన్మయి శ్రీ పాద, పుణ్య సెల్వ తమదైన శైలిలో ఆలపించారు. సమంత కనిపించిన తీరు, ఎనర్జిటిక్‌ స్టెప్పులు, క్లాసీ కొరియోగ్రఫీ ఈ  పాటను విజువల్‌ ట్రీట్‌గా మార్చేశాయి. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ‘తస్సాదియ్యా...’ ఉంటుంది. ‘ఓ బేబీ’ తర్వాత నందినీ రెడ్డి, సమంత కలిసి చేసిన ‘మా ఇంటి బంగారం’పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. రాజ్‌ నిడిమోరు స్టోరీ, స్క్రీన్‌ ప్లేని అందించడంతో ఈ మూవీకి మరింతగా హైప్‌ వచ్చింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా ‘మా ఇంటి బంగారం’ ఉంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది.  

ఫాంటసీ ఎంటర్‌టైనర్‌  
రష్మికా మందన్నా భలే జోరు మీద ఉన్నారు. ఓ వైపు హీరోయిన్‌గా తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్న ఆమె మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌లోనూ నటిస్తున్నారు. రష్మిక కమిట్‌ అయిన తొలి ఉమన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘రెయిన్బో’. ఈ చిత్రం ద్వారా శాంతరూబన్‌ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీలో రష్మికకి జోడీగా మలయాళ నటుడు దేవ్‌మోహన్ నటించారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌పై ఎస్‌ఆర్‌. ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌. ప్రభు తెలుగు– తమిళ భాషల్లో నిర్మించారు. ‘‘విభిన్నమైన రొమాంటిక్‌ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా  రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో రష్మిక  పాత్ర అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇప్పటి వరకూ చూడని సరికొత్త  పాత్రలో ఆమె ప్రేక్షకులను అలరిస్తారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం, కె.ఎం.భాస్కరన్ఛాయాగ్రహణం ఈ మూవీకి హైలెట్‌గా నిలుస్తాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఇదిలా ఉంటే... చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటున్న ‘రెయిన్‌బో’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక రష్మిక నటించిన సెకండ్‌ లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. రాహుల్‌ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా 2025 నవంబరు 7న తెలుగుతో  పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్‌ అయింది. రష్మిక చేసిన తొలి సినిమా ‘రెయిన్‌బో’ విడుదల కాకమునుపే సెకండ్‌ ఫిల్మ్‌ ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ విడుదలవడం విశేషం.  

మైసా యాక్షన్‌ 
రష్మికా మందన్న నటిస్తున్న మరో  పాన్‌ ఇండియా లేడీ ఓరియంటెడ్‌ ప్రాజెక్ట్‌ ‘మైసా’. రవీంద్ర పుల్లె రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్‌ ఇతర  పాత్రలు పోషిస్తున్నారు. అన్ఫార్ములా ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో గోండు గిరిజన అమ్మాయి మైసాగా కనిపించనున్నారామె. ఈ  పాత్ర కోసం తనను తాను శారీరకంగా, మానసికంగా పూర్తిగా మార్చుకున్నారు రష్మిక. రా,  రియల్‌గా అనిపించే యాక్షన్‌ పెర్ఫార్మెన్స్‌ కోసం బ్యాంకాక్‌కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్‌లో శిక్షణ తీసుకున్నారు.

రోజుకు దాదాపు ఎనిమిది గంటల  పాటు అడ్వా¯Œ్డ్స స్టంట్స్, హ్యాండ్‌ టు హ్యాండ్‌ ఫైట్, హై స్పీడ్‌ యాక్షన్‌ టెక్నిక్స్‌ నేర్చుకున్నారు. ఆమె శిక్షణ పొందిన ఫొటోలు చూస్తే సాధారణంగా కనిపించే సాఫ్ట్‌ నేచర్‌ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా, ఈ చిత్రంలో ఒక దృఢ సంకల్పంతో కూడిన యోధురాలిలా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీ తాజా షెడ్యూల్‌ కేరళలో ప్రారంభం అయింది. ‘‘ పాన్‌ ఇండియాగా రూపొందుతోన్న ఈ మూవీలో తన కెరీర్‌లో అత్యంత సవాల్‌తో కూడిన  పాత్ర చేస్తున్నారు రష్మిక. 15 రోజుల యాక్షన్‌ ΄్యాక్డ్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ కేరళలో ప్రారంభించాం.

కేచా ఖంపక్దీ మాస్టర్‌ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. రష్మికతో  పాటు కీలక నటీనటులు  పాల్గొంటున్న ఈ యాక్షన్‌ షెడ్యూల్‌ సినిమాలో మేజర్‌ హైలెట్‌గా నిలుస్తాయి. అంతర్జాతీయ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ ఆండి లాంగ్‌ యాక్షన్‌ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ మూవీకి శ్రేయాస్‌ పి. కృష్ణ సినిమాటోగ్రఫీ, జేక్స్‌ బిజోయ్‌ సంగీతం హైలైట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రం ఫీమేల్‌ సెంట్రిక్‌ యాక్షన్‌ సినిమాలకు కొత్త బెంచ్‌ మార్క్‌ని సెట్‌ చేయబోతోంది. ఈ మూవీలో ఓ యాక్షన్‌ సన్నివేశం కోసం 80 అడుగుల ఎత్తు నుంచి జంప్‌ చేశారు రష్మిక’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

కోర్టు రూమ్‌ డ్రామా...   
‘మహానటి’ చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక అభిమానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్‌. ‘నేను శైలజ, నేను లోకల్, సర్కారు వారి  పాట, దసరా’ వంటి హిట్‌ సినిమాల్లో నటించారామె. తెలుగుతో  పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటించిన ఆమె పెళ్లి కోసం కొంచెం విరామం తీసుకున్నారు. ఇప్పుడు కెరీర్‌లో మళ్లీ స్పీడు పెంచారు కీర్తీ సురేష్‌. ప్రస్తుతం తెలుగులో ‘రౌడీ జనార్ధన’తో  పాటు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా నటిస్తున్నారు. అలాగే మలయాళం, హిందీ సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె ప్రధాన  పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘సత్యవాన్ సావిత్రి’. ప్రవీణ్‌ ఎస్‌. విజయ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

మిస్కిన్, బాల శరవణన్, చారుకేశ్, శిల్పా మంజునాథ్‌ ఇతర  పాత్రలు పోషించారు. డ్రమ్‌స్టిక్స్‌ ప్రోడక్షన్స్ , జీ స్టూడియోస్‌ సంస్థలు నిర్మించాయి. కోర్టు రూమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ నుంచి విడుదలైన కీర్తి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి మంచి స్పందన వస్తోంది.      ‘ప్రశాంతమైన ముఖం.. అజేయమైన శక్తి.. ఇప్పుడు అంతా ఆమె వంతు’ అంటూ మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో కోర్టు వాతావరణంలో లాయర్ల మధ్య నిలబడి ఉన్న కీర్తి... సాధారణ చుడీదార్‌ ధరించి, నుదుట,  పాపిట్లో కుంకుమ బొట్టుతో కనిపిస్తోంది. ఆమె కళ్లలో అమాయకత్వం కనిపిస్తున్నప్పటికీ, ఏదో గట్టి పోరాటం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు మిస్కిన్‌ ప్రధాన  పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్‌ సీఎస్‌ మ్యూజిక్, నేపథ్య సంగీతం అదిరిపోయేలా ఉంటుందట. చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుపుకుంటున్న  ‘సత్యవాన్ సావిత్రి’ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది.

మహాదేవిగా...  
‘శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి చిత్రాలతో అభిరుచిగల నిర్మాతగా పేరు సొంతం చేసుకున్నారు సుమంత్‌ ఆర్ట్స్‌ అధినేత ఎంఎస్‌ రాజు. నిర్మాత నుంచి డైరెక్టర్‌గా మలుపు తీసుకున్న ఆయన ‘డర్టీ హరి’, ‘మళ్లీ పెళ్లి’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అగధ’. హీరోయిన్‌ కామాక్షి భాస్కర్ల ఇందులో ప్రధాన  పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రోడక్ష¯Œన్స్‌  బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ మూవీ పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల నటించిన మహాదేవి  పాత్రని పరిచయం చేస్తూ ఇటీవల ఆమె లుక్‌ని విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ మూవీలో ‘డర్టీ హరి’ మూవీ ఫేమ్‌ శ్రవణ్‌ రెడ్డి సింహ అనే  పాత్ర పోషించారు. అదేవిధంగా ఈ సినిమా ద్వారా ప్రముఖ నటీనటులు మంజుల–విజయ్‌ కుమార్‌ మనవరాలు, నటి వనిత కుమార్తె జోవిక తెలుగులో పరిచయం అవుతున్నారు. హరిణి  పాత్రలో ఆమె నటించినట్లు పేర్కొంటూ ఇటీవల ఆమె లుక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌.     ‘‘అగధ’లోని దైవిక, ఆధ్యాత్మిక అంశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి.

85 రోజుల షూటింగ్‌... విస్తృతమైన సెట్‌ వర్క్‌.. దాదాపు 45 నిమిషాల వి.ఎఫ్‌.ఎక్స్‌తో మా మూవీ ఆడియన్స్‌కి గొప్ప సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. 
పైన పేర్కొన్న హీరోయిన్లే కాదు.. మరికొంత మంది కథానాయికలు కూడా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు.  

ఎంఎస్‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో.. 
‘అమ్మాయిలు కాదు... అమ్మాయి... భానుమతి... ఒక్కటే పీస్‌... రెండు కులాలు, రెండు మతాలు... హైబ్రీడ్‌ పిల్ల’ అంటూ ‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవి చేసిన అల్లరి ప్రేక్షకులకు బాగా నచ్చింది. ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్, పడిపడి లేచె మనసు, శ్యామ్‌ సింగరాయ్, విరాట పర్వం, తండేల్‌’ వంటి తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు సాయి పల్లవి. ‘తండేల్‌’ మూవీ తర్వాత ఆమె మరో తెలుగు చిత్రం ఏదీ ఒప్పుకోలేదు. కానీ, హిందీ, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆమె ఓ తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్‌సి గ్నల్‌ ఇచ్చారని, అది కూడా లెజెండరీ సింగర్‌ ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌ అని టాక్‌. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి జీవిత కథ తెరపైకి రానున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీకి ‘జెర్సీ’ మూవీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తారు. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు ఈ మూవీ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పనులు జరుగుతున్నాయి. ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి  పాత్రలో సాయి పల్లవి నటించనున్నారనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. ప్రీ–్ర΄÷డక్షన్‌ పనులతో బిజీగా ఉన్న ఈ చిత్రం అక్టోబరులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

ఇదిలా ఉంటే... సాయి పల్లవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి బయోపిక్‌ మూవీ నుండి తప్పుకున్నారని, ఆ అవకాశం రుక్ష్మిణీ వసంత్‌కు దక్కిందనే వార్తలు కూడా ఇటీవల వచ్చాయి. మరి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి  పాత్ర చేసే అవకాశం సాయి పల్లవికి దక్కుతుందా? లేదా రుక్ష్మిణీ వసంత్‌ని వరిస్తుందా? అన్నది వేచి చూడాలి.  

పవర్‌ఫుల్‌ పోలీస్‌  
తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ... ఇలా దక్షిణాదిలో పలు సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సంయుక్త. కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీకి తొలిసారి తెలుగులో ఆమె సంతకం చేశారు. అయితే ‘భీమ్లా నాయక్‌’ సినిమా ముందుగా విడుదలైంది. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూ పాక్ష’ వంటి వరుస హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న సంయుక్త నటించిన తొలి లేడీ ఓరియంటెడ్‌ సినిమా ‘ది బ్లాక్‌ గోల్డ్‌’.

యోగేష్‌ కేఎంసీ దర్శకత్వం వహించారు. మురళీ శర్మ, రావు రమేశ్, నాజర్, మనీష్‌ వాధ్వా, రామ్‌కి, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, కృష్ణ చైతన్య, చంద్రిక రవి ముఖ్యమైన  పాత్రలు పోషించారు. ‘ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం, సామజవరగమన, ఊరు పేరు భైరవకోన, మజాకా’ వంటి సినిమాలు తీసిన రాజేశ్‌ దండా హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్‌ బ్యానర్స్‌పై ఈ సినిమా నిర్మించారు. ‘‘సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ది బ్లాక్‌ గోల్డ్‌’. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌  పాత్రలో నటించారు సంయుక్త. దేశాన్ని కుదిపేసిన కోల్‌ సిండికేట్‌ల నేపథ్యంలో, నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఈ కథని మరింత గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దారు యోగేష్‌.

స్క్రిప్ట్‌లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. సంయుక్త కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన హై ఓల్టేజ్‌ ప్రాజెక్ట్‌ ఇది. ఈ చిత్రాన్ని మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆదిలాబాద్‌ ప్రాంతాలతో  పాటు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్‌లో చిత్రీకరించాం. మొత్తం 60కి పైగా వర్కింగ్‌ డేస్‌లో షూటింగ్‌ పూర్తి చేయడం విశేషం. ఐదు పవర్‌ఫుల్‌ షెడ్యూల్స్‌లో, పదికి పైగా భారీ సెట్లలో, రోజుకు 300 మందికి పైగా క్రూ  పాల్గొంటూ చిత్రీకరించాం. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాల్లో అరుదుగా కనిపించే స్థాయిలో యాక్షన్‌ సన్నివేశాలుంటాయి.

ఈ చిత్రీకరణ కోసం ప్రతిరోజూ రెండు కెమెరాలను ఉపయోగించాం. కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా ఐదు కెమెరాలను ఏకకాలంలో వినియోగించాం. ఈ చిత్రానికి సామ్‌ సీఎస్‌ సంగీతం సమకూర్చగా, ఎ. వసంత్‌ సినిమాటోగ్రఫీ అందించారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో రూపొందించిన ‘బ్లాక్‌ గోల్డ్‌’ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో త్వరలో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.

– డేరంగుల జగన్‌ మోహన్‌ 

Advertisement
 
Advertisement
Advertisement