‘జన నాయగన్‌’.. నాడు శాపం నేడు వరం | TVK Vijay Win Brings Big Relief For Jana Nayagan Movie | Sakshi
Sakshi News home page

‘జన నాయగన్‌’కి శాపమే వరమైంది.. కనక వర్షం గ్యారెంటీ!

May 5 2026 3:28 PM | Updated on May 5 2026 3:51 PM

TVK Vijay Win Brings Big Relief For Jana Nayagan Movie

ఏది జరిగినా  మన మంచికే అనుకునే మనసు ఉంటే…ప్రతి కష్టం ఒక పాఠం అవుతుంది… ప్రతి ఓటమి ఒక అవకాశంగా మారుతుంది. ఇప్పుడు దళపతి విజయ్‌ విషయంలో ఇదే జరిగింది. ఎన్నికల ముందు ఆయనకు వరుస ఇబ్బందులు ఎదురయ్యాయి. భార్య సంగీతతో విడాకులు వివాదం.. మరోవైపు ప్రచారంలో తొక్కిసలాటలు, ఇంకోవైపు తన చివరి చిత్రం విడుదల వాయిదా పడడం.. ఇవన్నీ తట్టుకొని అలుపెరగకుండా ప్రచారం చేసి.. చివరకు రాజకీయ ప్రభంజనం సృష్టించాడు. తమిళనాడు రాష్ట్రానికి ఆయన సీఎం అయ్యే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలవుతున్న ఏకైక సినిమా ‘జన నాయగన్‌’ కాబట్టి.. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురవడం కూడా ఖాయమే.

ఆలస్యమే ఆమృతం..
ఆలస్యం అయితే అమృతం కూడా విషం అవుతుందంటారు. నిజమే కానీ ‘జన నాయగన్‌’ విషయంలో మాత్రం ఆలస్యమే అమృతం అయ్యేలా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ పలు కారణాలతో వాయిదా పడింది. ఎన్నికల ముందు రిలీజ్‌ అయితే.. కొంతవరకు పొలిటికల్‌ కెరీర్‌కి కూడా ప్లస్‌ అవుతుందని విజయ్‌ భావించాడు. కానీ అది జరగలేదు. వాయిదా పడడమే కాదు.. అందులోని కొన్ని సన్నివేశాలు కూడా లీకయ్యాయి. 

ఓటీటీ బిజినెస్‌ కూడా చేజారిపోయింది. ఇక జన నాయగన్‌ రిలీజ్‌ అవుతుందో లేదో అని చాలా మంది అనుకున్నారు. కానీ నిన్నటి ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేసింది. 108 స్థానాల్లో టీవీకే పార్టీ గెలిచి.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. విజయ్‌ సీఎం అయిన తర్వాత జననాయగన్‌ విడుదల అవ్వడం ఖాయం. అప్పుడు ఈ సినిమాకు వచ్చే హైప్‌, క్రేజ్‌ వేరే లెవెల్‌ ఉంటుంది.

బాక్సాఫీస్‌ షేక్‌ అవ్వాల్సిందే..
ఎన్నికల ముందు రిలీజ్‌ అయి ఉంటే..టాక్‌ని బట్టి కలెక్షన్స్‌ ఉండేవి. హిట్‌ టాక్‌ వస్తే కానీ ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ వచ్చేవి. కానీ ఇప్పుడు టాక్‌తో సంబంధం లేదు. సినిమా ఎలా ఉన్నా.. తొలి మూడు రోజులు థియేటర్స్‌ కిక్కిరిసిపోతాయి. సీఎం సినిమా కాబట్టి.. ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతులన్నీ వచ్చేస్తాయి. ఎన్నికల ముందు ఎలా ఉండేదో కానీ..ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్‌ షేక్‌ అవ్వడం ఖాయం. ఈ సినిమాతో భారీగా నష్టాలు తప్పవని భావించిన  కెవీఎన్ సంస్థ ఇప్పుడు ఊపిరిపీల్చుకుంది. మొన్నటిదాక జన నాయగన్‌కి శాపంగా మారినవన్నీ ఇప్పుడు వరంగా మారాయి.  మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement