బోర్ కొట్టేస్తున్న తెలుగు సినిమాలు.. ఎందుకిలా!? | Telugu Movies Getting Bored Reasons behind This | Sakshi
Sakshi News home page

Tollywood: తెలుగు దర్శకులు అప్‌డేట్ కావట్లేదా? లేదంటే..

May 5 2026 4:50 PM | Updated on May 5 2026 4:53 PM

Telugu Movies Getting Bored Reasons behind This

తెలుగు దర్శకుల్లో చాలామంది తాము తీసేదే అద్భుతమైన కళాఖండం అనుకుని భ్రమపడుతున్నారు. బాగోలేదని ఒప్పుకోవడానికి కూడా వాళ్లకు మనసు రావట్లేదు. రొటీన్ ఫక్తు కమర్షియల్ అంశాలతో బోర్ కొట్టిస్తున్నారు. ప్రేక్షకులకు నచ్చేలా తీయడం సంగతి అటుంచి ఏ జానర్ ట్రెండ్ అవుతుంటే దాని వెంట పడుతున్నారు. అయినా గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఇంతకీ డైరెక్టర్స్ అప్డేట్ అవ్వట్లేదా? లేదంటే ప్రేక్షకులు అడ్వాన్స్ అయ్యారా? అసలేం జరుగుతోంది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

టాలీవుడ్ అనగానే చాలామందికి కమర్షియల్ సినిమాలే గుర్తొస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఈ తరహా చిత్రాలే దాదాపుగా వచ్చేవి. అప్పట్లో మొబైల్, టెక్నాలజీ లాంటివి పెద్దగా లేకపోవడంతో సినిమా ఒక్కటే వినోద సాధనంగా ఉండేది. దీంతో లాజిక్స్ పట్టించుకోకుండానే మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్స్ ఎక్కువపోయాయి. మొబైల్, టీవీ, క్రికెట్ ఇలా కళ్లముందు చాలానే కనిపిస్తున్నాయి. వీటన్నింటిని దాటుకుని సినిమా చూడాలంటే అందులో కచ్చితంగా సమ్‌థింగ్ స్పెషల్ ఉండాలి. ఇప్పుడొస్తున్న తెలుగు సినిమాల్లో అదే మిస్ అవుతోంది.

ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో కొన్ని అంశాలైనా ప్రేక్షకులు తమని తాము రిలేట్ చేసుకునేలా ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి వాటిని డైరెక్టర్స్ మిస్ చేస్తున్నారు. కథల్లో సహజత్వం పెద్దగా కనిపించట్లేదు. దీంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు. కొత్తగా కామెడీ, డ్రామా సృష్టించడం లాంటివి చేయకుండా వింటేజ్ పేరు చెప్పి పాత సినిమాల్లో పాటలు, కామెడీని, డ్రామాని వాడేయాలని చూస్తున్నారు. అవి ఎందుకో సరిగా కుదరట్లేదు.

(ఇదీ చదవండి: విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!)

ఈ ఏడాదే తీసుకుంటే సంక్రాంతికి వచ్చిన 'మన శంకరవరప్రసాద్' సినిమా తప్పితే ఒక్కటి కూడా సరైన సక్సెస్ అందుకోలేదు. బైకర్, డెకాయిట్ లాంటివి కాస్త ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి గానీ వీటిలో కథ ఉన్నప్పటికీ అనవసరమైన కమర్షియల్ అంశాలు చేర్చి సూపర్‌హిట్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఇకపోతే 'నారీ నారీ నడుమ మురారి', 'యుఫోరియా', 'శ్రీ చిదంబరం గారు', 'కపుల్ ఫ్రెండ్లీ' లాంటి కొన్ని మూవీస్ మంచి కంటెంట్‌తో వచ్చాయి గానీ వీటికి థియేటర్లలో సరైన సపోర్ట్ దొరకలేదు. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత జనాదరణ పొందాయి.

మొత్తంగా చూస్తే చాలామంది దర్శకులు.. తెలుగు ప్రేక్షకుల్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఏం తీసినా చూస్తారులే అనుకుంటున్నారు. మరికొందరైతే ప్రమోషన్లలో నవ్విస్తున్నారు గానీ సినిమాలో తీసికట్టు కంటెంట్‌తో విసుగు తెప్పిస్తున్నారు. అందుకే ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న మలయాళ, ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాల‍ని చూసుకుంటున్నారు. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే, అవి కూడా బాగుంటేనే ప్రేక్షకుడు థియేటర్‌కి వెళ్తాడు. రొటీన్ కంటెంట్‌తో ఇంకా బోర్ కొట్టిస్తే వాటికి కూడా వెళ్లాలా వద్దా అని సందేహపడతాడు! అప్పుడు టాలీవుడ్‌కే కష్టకాలం!

(ఇదీ చదవండి: ‘జన నాయగన్‌’.. నాడు శాపం నేడు వరం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement