
భారత్‌లో క్రికెట్, సినిమాకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడున్న వాళ్లు ఇక్కడి వాళ్లతో, ఇక్కడివాళ్లు అక్కడ వాళ్లతో ప్రేమ కథలు కొనసాగిస్తారు. అంతేకాదు క్రికెట్ ఆటగాళ్లు చాలా మంది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. ఇప్పటికే హర్భజన్ సింగ్ , శ్రీశాంత్ లాంటి వాళ్లు నటులుగా తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అయితే ఆయన మాత్రం హీరోగా కాకుండా నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో టీమిండియా క్రికెటర్ కూడా సినిమాల్లోకి రావాలనుకుంటున్నారట.
(చదవండి: వెండితెరపై 65 ఏళ్ల మహిళ బయోపిక్.. ఆమె ఎవరంటే ?)
తనదైన బ్యాటింగ్ స్టైల్‌తో అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్న శిఖర్ ధావన్.. ఇప్పుడు యాక్టింగ్‌తో అదరొట్టాలనుకుంటున్నాడట. ఓ భారీ చిత్రంతో ధావన్ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి అయినట్లు సినీ వర్గాల సమాచారం. అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదట. గతంలో అక్షయ్ కుమార్ ‘రామసేతు’లో శిఖర్ ధావన్ నటిస్తున్నాడని వార్తలు వినిపించాయి. కానీ అది పుకారు మాత్రమేనని తేలింది. సోలో హీరోగానే వెండితెర ఎంట్రీ ఇవ్వాలని ధావన్ భావిస్తున్నాడట. ఈ ఏడాదిలోనే ఆయన నటించే సినిమా విడుదల కాబోతున్నట్లు సిని వర్గాల సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే.. ధావన్ ప్రకటన చేసేవరకు వేచి చూడాల్సిందే.