పేద విద్యార్థి కల నెరవేర్చిన శివకార్తికేయన్‌

Sahana Thanks Sivakarthikeyan For Kind Gesture Study Medicine - Sakshi

తమిళ సినిమా: పేద విద్యార్థి డాక్టర్‌ కలను నటుడు శివకార్తికేయన్‌ సాకారం చేశారు. తంజావూర్‌ జిల్లా, పేరావురణి సమీపంలోని పూకొల్లై ప్రాంతానికి చెందిన దంపతులు గణేషన్, చిత్ర కార్మికులు. ఈ దంపతులకు కూతురు సహానా పేరావురణి ప్రభుత్వ బాలల ఉన్నత విద్యాలయంలో ప్లస్‌టూ చదువుకుంది. వీధిలైట్ల కాంతిలో చదువుకున్న సహానా పరీక్షల్లో 600లకు  524 మార్కులు సాధించి ఉత్తీర్ణత పొందింది. గజ తుపాన్‌ కారణంగా ఇల్లు కూలిపోవడంతో వీధి లైట్ల వెలుతురులో చదువుకొని ప్లస్‌టూలో అత్యధిక మార్కులు సాధించింది. దీంతో సహానా డాక్టర్‌ అవ్వాలని కలలు కంది.

ఈమె గురించి గత ఏడాది ఏప్రిల్‌ 25వ తేదీన ఒక తమిళ దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. అది చూసిన తంజావూర్‌ కలెక్టర్‌ అన్నాదురై ఆమె ఇంటికి వెళ్లి రెండు సోలార్‌ లైట్లను కొనిఇచ్చి, ఇతర ఖర్చులు రూ.10 వేలు సాయం చేశారు. ఈ విషయం శివకార్తికేయన్‌ దృష్టికి రావడంతో ఆయన వెంటనే తంజావూరులోని ప్రైవేట్‌ నీట్‌ కళాశాలలో శిక్షణ పొందడానికి సహానాకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించారు. ఇటీవల జరిగిన నీట్‌ పరీక్షలో సహానా 273 మార్కులను తెచ్చుకొని తిరుచ్చిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరింది.  (శశికళ ఆశలు అడియాశలు..!)

ఈ సందర్భంగా వైద్య విద్యార్థి సహానా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ డాక్టర్‌ కావాలన్న తన కల కు పలువురు ప్రాణం పోశారని పేర్కొంది. ముఖ్యంగా నటుడు శివకార్తికేయన్‌ సాయంతోనే తన డాక్టర్‌ కల నెరవేరిందని చెప్పింది. ఆయన తన వైద్యవిద్యకు అయ్యే ఖర్చు అంతా భరిస్తానని చెప్పారని తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు  ముఖ్యమంత్రి 7.5  శాతం రిజర్వేషన్‌ కల్పించడం కూడా తన డాక్టర్‌ కల సాకారానికి కారణమని సహానా పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top