సినిమాల్లో అలా మేనేజ్‌ చేయొచ్చు కానీ ..: రుక్మిణీ వసంత్‌ | Rukmini Vasanth Opens Up On Modeling Challenges As National Crush Rises Across South Indian Cinema, More Details Inside | Sakshi
Sakshi News home page

సినిమాల కంటే మోడలింగ్‌లోనే సవాళ్లు ఎక్కువ : రుక్మిణీ వసంత్‌

May 14 2026 8:36 AM | Updated on May 14 2026 10:38 AM

Rukmini Vasanth Says Models Face Challenges More Than Actors

అతి తక్కువ కాలంలో శాండిల్‌వుడ్‌ నుంచి బాలీవుడ్‌ స్థాయికి ఎదిగిన కథానాయకి రుక్మిణీ వసంత్‌. ప్రస్తుతం కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారీ భామ. నిజం చెప్పాలంటే తమిళంలో రుక్మిణీవసంత్‌కు ఇంకా సరైన హిట్టు పడలేదు. విజయ్‌సేతుపతికి జంటగా ఏస్‌ అనే చిత్రం ద్వారా ఈ అమ్మడు కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శివకార్తికేయన్‌ సరసన మదరాసి చిత్రంలో నటించారు. 

ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. అయినప్పటికీ రుక్మిణీ వసంత్‌కు పలు భాషల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇంతకుముందు కన్నడంలో రిషబ్‌శెట్టితో కలిసి నటించిన కాంతార చాప్టర్‌–1 చిత్రం బాలీవుడ్‌ వరకు తీసుకెళ్లింది. దీంతో అభిమానులు ఆమెను నేషనల్‌ క్రష్‌ గా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం యష్‌తో కలిసి నటించిన కన్నడ చిత్రం టాక్సిక్‌ త్వరలో ఆల్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

అదేవిధంగా తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. వీటితోపాటు తమిళంలో మరో రెండు కొత్త చిత్రాలు వరించినట్లు తాజా సమాచారం. రుక్మిణీవసంత్‌ మోడలింగ్‌ రంగం నుంచి వచ్చారన్నది చాలా మందికి తెలిసుండదు. కాగా మోడలింగ్‌, సినిమా రంగం గురించి ఇటీవల ఈమె పేర్కొన్న విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

అందులో సినిమాల్లో నటీనటులు పంచ్‌ డైలాగులు చెప్పి, యాక్షన్‌ సన్నివేశాల్లో నటించి మేనేజ్‌ చేయవచ్చు, అయితే మోడలింగ్‌ రంగంలో అలాంటి అవకాశం ఉండదు. ఒక మాట కూడా మాట్లాడకుండా భావాలను, అభినయాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇదే మోడలింగ్‌ సుందరీమణులకు పెద్ద సవాల్‌. ఇప్పటి వరకు నేను సినిమా రంగంలో నేర్చుకుంటున్న విషయం ఇదే అని రుక్మిణీ వసంత్‌ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement