Jr NTR: కాలర్‌ ఎగరేసుకునేలా చేశా.. ఆస్కార్‌ తీసుకుంటున్నప్పుడు

NTR Speech At Das Ka Dhamki Pre Release Event - Sakshi

‘‘సినిమా పట్ల విశ్వక్‌ సేన్‌కి ఎంతో పిచ్చి ఉంది. ఆ పిచ్చి తగ్గిపోకూడదు. ఇలాంటివాళ్లను ప్రోత్సహిస్తేనే పరిశ్రమ ఇంకా ముందుకెళుతుంది. ‘దాస్‌ కా ధమ్కీ’ హిట్‌ అవ్వాలి’’ అని హీరో ఎన్టీఆర్‌ అన్నారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌. కరాటే రాజు (విశ్వక్‌ సేన్‌ తండ్రి) నిర్మించిన ‘దాస్‌ కా ధమ్కీ’ ఈ నెల 22న విడుదలకానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ– ‘‘ఒకే చట్రంలో ఇరుక్కుపోతున్నానని చాలా కాలం తర్వాత రియలైజ్‌ అయిన నేను, మీరు (అభిమానులు) కాలర్‌ ఎత్తుకునే సినిమాలు చేస్తానని మాట ఇచ్చాను.. ఆ మాట అన్నప్పుడే నటుడిగా నేను మళ్లీ పుట్టాను. వైవిధ్యమైన నటన కోసం నేను తాపత్రయపడుతున్నాను కాబట్టే మిమ్మల్ని కాలర్‌ ఎగరేసుకునేలా చేస్తున్నానని అనుకుంటున్నాను. విశ్వక్‌ కూడా ఒకే తరహా పాత్రల నుంచి బయటికొచ్చి, కొత్తగా చేస్తున్నాడు.

‘దాస్‌ కా ధమ్కీ’ బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలి. ఆ తర్వాత తను దర్శకత్వం మానేయాలి. ఎందుకంటే కొత్త యువ దర్శకులకు నీలాంటి వాళ్లు అవకాశాలు ఇవ్వాలి. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ చిత్ర పటంలో ఆల్‌టైమ్‌ టాప్‌లో ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఈ రోజు ప్రపంచ చిత్రపటంలో నిలబడిందంటే, ఆస్కార్‌ అవార్డుని సొంతం చేసుకుందంటే దానికి మా యూనిట్‌తో పాటు యావత్‌ తెలుగు, భారతదేశ చిత్రపరిశ్రమ, ప్రేక్షక దేవుళ్లు కూడా కారణం.

కీరవాణి, చంద్రబోస్‌గార్లు ఆస్కార్‌ అవార్డు తీసుకుంటున్నప్పుడు నాకు వాళ్లు కనిపించలేదు.. ఇద్దరు భారతీయులు కనిపించారు.. ఇద్దరు తెలుగువాళ్లు కనిపించారు’’ అన్నారు. విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘ఇండియాలో బెస్ట్‌ యాక్టర్‌ ఎవరంటే ఎన్టీఆర్‌ అన్న అని నేను ఎప్పుడో చెప్పాను. నా సినిమాని ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్‌ వచ్చాడు. ఆయన రాకతో నా సినిమా బ్లాక్‌బస్టర్‌ స్టార్ట్‌ అయిపోయినట్లే’’అన్నారు. ‘‘ఫలక్‌నుమా దాస్‌’ తీసినప్పుడు మా అబ్బాయి విశ్వక్‌ ఎవరికీ తెలియదు. ఎంతో పబ్లిసిటీ చేసి, సినిమా విడుదలకి ముందే స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు. ‘దాస్‌ కా ధమ్కీ’ కోసం 15 నెలలు కష్టపడ్డాడు’’ అన్నారు కరాటే రాజు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top