బాలీవుడ్ నటి నిమిషా నాయర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై బాంద్రాలో క్యాబ్‌లో వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తనను ఇబ్బందిపెట్టారంటోంది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉదయం 4.50 గంటల సమయంలో నేను క్యాబ్‌లో వెళ్తున్నాను. ఆ సమయంలో డ్రైవర్ ఓ బైక్‌ను ఓవర్‌టేక్ చేశాడు. ఆ బైక్‌పై ఉన్నవారు బాగా తాగినట్లున్నారు. వాళ్లను దాటేసినందుకు కోపంతో ఊగిపోయారు.
కొట్టడానికి రెడీ..
క్యాబ్ డ్రైవర్‌కు గుణపాఠం చెప్పాలనుకున్నారు. హైవే మధ్యలో మా కారును అడ్డుకున్నారు. కారు ఎదుటే బైక్ నిలిపి ముందుకు వెళ్లనీయకుండా చేశారు. ఆవేశంతో ఎగబడ్డారు, దుర్భాషలాడారు. డోర్స్ తెరిచేందుకు ప్రయత్నించారు. నన్ను విండోస్ కిందకు దించమన్నారు. వాళ్లెంత రెచ్చగొట్టినా సరే మేము ఆ పని చేయలేదు. ఎందుకంటే అతడు డ్రైవర్‌ను కొట్టడానికే మా కారు ఆపాడని నాకు బాగా తెలుసు.. మా రక్షణ కోసం మేము సైలెంట్‌గా ఉండిపోయాం.
వీడియో తీస్తున్నానని..
మమ్మల్ని చాలాసేపు వేధించారు. నేను వీడియో తీస్తున్నానని గ్రహించి కారు ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు అని పేర్కొంది. వీరిపై చర్యలు తీసుకోమని పోలీసులను కోరింది. ఇది చూసిన నెటిజన్లు.. మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం, ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా నిమిషా నాయర్.. అమర్ కాలనీ, 8 ఏఎమ్ మెట్రో సినిమాల్లో నటించింది. 'ట్రయల్ బై ఫైర్' వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది.


