
అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్పై సంగీత దర్శకులు ఇళయరాజా మద్రాస్ కోర్టులో కేసు దాఖలు చేశారు. తన సంగీతంలో వచ్చిన పాటలను అనుమతి లేకుండా ఈ సినిమాలో ఉపయోగించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఇళయరాజా న్యాయవాదులు తెలిపారు.
తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కోలీవుడ్లో నటుడు అజిత్ కుమార్తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 250 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమాలో ఇళయరాజా పాత పాటలను తన అనుమతి లేకుండా ఉపయోగించారు.., అందుకు గాను రూ 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని వారు పేర్కొన్నారు. ఆపై ఏడు రోజుల్లోగా సినిమా నుంచి పాటను తొలగించాలని నోటీసులో డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇళయరాజా న్యాయవాదులు కె. త్యాగరాజన్, ఎ. శరవణన్ మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు.

అయితే, ఆ పాటలకు సంబంధించిన అసలు హక్కుదారుల నుంచి అనుమతి తీసుకున్నామని సినిమా నిర్మాతలు చెబుతున్నారు. కానీ, అసలు యజమాని ఎవరో వెల్లడించలేదని న్యాయవాదులు అంటున్నారు. ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలను పలు సినిమాల్లో నిరంతరం ఉపయోగించడాన్ని నిషేధించాలని వారు కోరారు. ఇప్పటివరకు ఉపయోగించుకున్న వారు తగిన పరిహారం చెల్లించాలని తెలిపారు. ఈ కేసు సెప్టెంబర్ 8న న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ ముందు విచారణకు రానుంది.