Vijay Thalapathy Master Telugu Movie Review And Rating | Master Movie Review - Sakshi
Sakshi News home page

మాస్టర్‌ మూవీ రివ్యూ

Jan 13 2021 1:55 PM | Updated on Jan 13 2021 3:41 PM

Master Telugu Movie Review And Rating - Sakshi

విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్‌ స్టార్‌ హీరో ‘ఇళయదళపతి’విజయ్‌. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తూ.. కోలీవుడ్‌లో అగ్ర కథానాయకుడితనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నాడు.

టైటిల్‌ : మాస్టర్
జానర్ : యాక్షన్‌ థ్రిల్లర్‌
నటీనటులు : ఇళయదళపతి విజయ్‌, విజయ్‌ సేతుపతి, మాళవికా మోహన్‌, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్‌, అర్జున్‌ దాస్‌, గౌరి జి కిషన్‌, అళగమ్‌ పెరుమాళ్‌, శ్రీమాన్‌, పూవైయార్‌ తదితురులు
నిర్మాణ సంస్థ :  ఎక్స్‌బీ ఫిలిమ్స్‌ క్రియేటర్స్‌
నిర్మాత :  జేవియర్‌ బ్రిట్టో
దర్శకత్వం : లోకేశ్ కనకరాజ్
సంగీతం :  అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ :  సత్యన్ సూర్యన్
ఎడిటర్‌ : ఫిలోమన్‌ రాజు
విడుదల తేది : జనవరి 13, 2021

విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్‌ స్టార్‌ హీరో ‘ఇళయదళపతి’ విజయ్‌. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తూ.. కోలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. వరుసగా సినిమాలను ప్రకటిస్తూ సత్తా చాటుతున్నాడు. పేరుకు కోలీవుడ్‌ హీరో అయినా.. తన ప్రతి సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తూ టాలీవుడ్‌లోనూ మంచి మార్కెటింగ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా ‘మాస్టర్’‌ అనే  సినిమాతో  బుధవారం ప్రేక్షకుల మందుకు వచ్చాడు. మాములుగా విజయ్ మూవీ అంటేనే ఫ్యాన్స్‌లో క్రేజ్ విపరీతంగా ఉంటుంది. అలాంటిది ఈ చిత్రంలో విజయ్‌తో పాటు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అటు కోలీవుడ్ ఇండస్ట్రీ.. ఇటు అభిమానుల్లోనూ ఎక్స్‌పెక్టెషన్స్‌ పీక్స్‌కు చేరుకున్నాయి. మరి ఫ్యాన్స్‌ అంచాలను మాస్టర్‌ ఏమేరకు అందుకున్నాడు? విజయ్‌ తన విజయాల పరంపరను కొనసాగించాడా లేదా? అనేది రివ్యూలో చూద్దాం.

కథ
భవాని(విజయ్‌ సేతుపతి) వరంగల్‌లో ఓ పేరు మోసిన రౌడీ. తాను ఎలా ఉంటాడో జనాలకు ఎక్కువ తెలియదు కానీ.. తను ఎంతటి క్రూరుడో జిల్లా మొత్తానికి తెలుసు. లారీలలో మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ, రాజకీయంగా ఎదగాలని చూస్తాడు. అందులో భాగంగా మొదటగా లారీ యూనియన్‌ అధ్యక్షుడు కావాలనుకుంటాడు. పోటీలో ఉన్న ప్రత్యర్థులను హతం చేసి ఏకగ్రీవంగా లారీ యూనియన్‌ అధ్యక్షుడు కావాలని ప్లాన్‌ వేస్తాడు.

ఇదిలా ఉంటే.. జేడీ(విజయ్‌) ఎలాంటి నియమ నిబంధనలు లేని ఓ కాలేజీ ప్రొఫెసర్‌. మద్యానికి బానిసై  తోటి సిబ్బందికి తలనొప్పిగా మారుతాడు. అతనంటే సహచర ఉద్యోగులకు ఇష్టం లేకపోయినా... విద్యార్థులకు మాత్రం ఆయనే హీరో. జేడీ సర్‌ లేనిదే కాలేజీలో ఎలాంటి కార్యక్రమాలు జరనిగవ్వరు. ఆయన కోసం ఏ పని చేయడానికైనా విద్యార్థులు సిద్దంగా ఉంటారు. అలాంటి జేడీ కొన్ని కారణాల వల్ల వరంగల్‌లోని బాల నేరస్థులకు పాఠాలు బోధించాల్సి వస్తుంది.

తొలుత అయిష్టంగానే అక్కడి వెళ్లిన జేడీకీ.. ఆదిలోనే అనుకోని ఒక సంఘటన ఎదురవుతుంది. ఈ క్రమంలో జేడీకి భవానికి పరోక్షంగా పోరు మొదలవుతుంది. అసలు బాల నేరస్థులకు, భవానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మద్యానికి బానిసైన జేడీ.. ఉన్నపళంగా తాగుడు మానేసి, పిల్లలను రక్షించేందుకు ఎందుకు పూనుకున్నాడు? భవాని ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యాన్ని జేడీ ఏవిధంగా కుప్పకూల్చాడనేదే మిగత కథ.

నటీనటులు
నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించే ఓ కాలేజీ ప్రొఫెసర్‌గా విజయ్‌ ఒదిగి పోయాడు. స్టైల్‌, యాక్షన్‌తో మాస్‌ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇక విజయ్‌ సేతుపతి ఎప్పటిలాగానే క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయాడు. తన ఎదుగుదల కోసం ఎంతటి అన్యాయమైనే చేసే క్రూరుడిగా అద్భుతంగా నటించాడు. హీరో, విలన్‌ నటనలో ఇద్దరు తమకు తామే సాటి అన్నట్లుగా పోటీపడ్డారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు భవాని పాత్రను మర్చిపోరు. విలన్‌ పాత్రలో అంతలా ఒదిగిపోయాడు విజయ్ సేతుపతి. చారు పాత్రలో మాళవికా మోహన్‌ ఆకట్టుకుంది. సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేనప్పటికీ.. తెరపై కనిపించిన విధానం బాగుంది. ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్‌ తమ పరిధి మేర నటించారు. 

విశ్లేషణ
‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో వస్తున్న చిత్రం కావడంతో మాస్టర్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలు దర్శకుడు అందుకోలేకపోయాడనే చెప్పాలి. విజయ్‌ లాంటి మాస్‌ హీరోతో ఓ సందేశాత్మక చిత్రానికి కమర్షియల్‌ మసాలాలు జోడించి చెప్తామనుకొన్న డైరెక్టర్‌ తడబడ్డాడు. తొలిభాగం అసలు కథ చెప్పకుండా హీరోని, విలన్‌ని హైలెట్‌ చేయడానికే కేటాయించాడు. మత్తుకు బానిసైన ఫ్రొఫెసర్‌ పట్ల విద్యార్థులు అంతలా ఎందుకు అభిమానం చూపిస్తారో బలమైన కారణాలు చూపించలేకపోయారు. అసలు కథ ఏంటో సెకండాఫ్‌లో చూపిస్తాడు అనుకుంటే.. అక్కడ కూడా కొన్ని సాగతీత సీన్లు ఇబ్బంది పెడతాయి. ఇక హీరో ప్రతి సారి వెనక్కి తిరిగి వేసే స్టెప్పులు కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చవు. హీరో, విలన్ల మధ్య జరిగే పోరాటం కూడా అంతగా రక్తి కట్టించలేకపోయాయి.

హీరో, విలన్ల పాత్రలను బలంగా తీర్చిదిద్దినప్పటికీ వారిద్దరు కలిసిన సన్నివేశాలను మాత్రం మరీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కథ కూడా సగటు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతుంది. బాల నేరస్తుల అబ్జర్వేషన్‌ హోమ్‌ నేపథ్యంలో కథను తీర్చిదిద్దిన విధానం బాగుంది.  అనిరుధ్  పాటలు తెలుగు ఆడియన్స్‌ ను పెద్దగా అలరించకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం అదిరిపోయింది. యాక్షన్‌ సీన్లు అన్ని మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. సత్యన్ సూర్యన్ విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్‌ పై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ‘మాస్టర్‌’ చెప్పే పాఠాలు ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు.

ప్లస్ పాయింట్స్ :
విజయ్‌, విజయ్‌ సేతుపతి నటన
బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌
కథా నేపథ్యం

మైనస్‌ పాయింట్స్‌
సాగదీత సీన్లు
ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగే కథ

అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement