ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘లైక్’ మూవీ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ప్రేమ గుడ్డిది అనే నానుడి వినే ఉంటారు. కానీ ఇదే నానుడి పోను పోను ప్రేమ డిజిటలైజ్డ్ అని వినిపించినా ఆశ్చర్యపోనక్కరలేదు. మనిషి తన మేధస్సుతో సాంకేతికతను బానిసగా చేసుకుంటున్నాను అనుకుంటున్న ఈ సమయంలో, అదే టెక్నాలజీ తన మనిషినే బానిసని చేసుకుంటోందని తెలుసుకోలేకపోతున్నాడు. మరీ ముఖ్యంగా రేపటి తరం ఈ టెక్నాలజీకి ఇప్పటి నుండే దాసోహం అంటున్నారు. మన చుట్టూ టెక్నాలజీ ఎంత ఎదిగినా మనలో ఉండే స్వచ్ఛమైన భావన ప్రేమ. కానీ ఆ ప్రేమను కూడా టెక్నాలజీకి ముడి పెడితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనతో వచ్చినదే ఈ ‘లైక్’ సినిమా.
ఈ రోజుల్లో పొద్దున నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయేంత వరకు మనమంతా ఇప్పుడు టెక్నాలజీతోనే ఉంటున్నాం. ఆరు నుండి అరవై ఏళ్ళ వృద్ధుల వరకు ఫోన్, ట్యాబ్‌లకు పూర్తిగా అలవాటు పడిపోయారు. ఆ అలవాటు మనకి ఎంత గ్రహపాటో వినోదాత్మకంగా ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు విఘ్నేష్ శివన్.
ఈ సినిమా చూడడం పూర్తయ్యాక మనం ఒక రోజైనా టెక్నాలజీకి దూరంగా ఉండాలని కొందరు పిల్లలు సైతం అనుకున్నారంటే... ఈ సినిమా ప్రభావం పిల్లల్లో కూడా ఎంతలా ఉందో ఆలోచించండి. అంతలా ఈ సినిమా కథలో ఏముందో ఓసారి చూద్దాం.
ఈ సినిమా మనకు 25 ఏళ్ళ తరువాత అంటే... 2040లో జరగబోయే కథన్న మాట. అప్పటికి ఇప్పుడున్న టెక్నాలజీ మరో వంద రెట్లు ఉంటుంది. అందుకే కథ ముందుగా పచ్చదనం ప్రాంతంలోని వైభవ్ వాస్ అనే యువకుడితో ప్రారంభమవుతుంది. పచ్చదనం ప్రాంతం అంటే 2040లో జైలన్నమాట. అంటే అక్కడ ఫోన్, టీవీ ఇలాంటివి ఏవీ ఉండవు. టెక్నాలజీ పెరిగిపోయి 2040లో నేరం చేసినవాళ్ళను పచ్చదనం ప్రాంతానికి శిక్షగా పంపుతారు. వాస్ వాళ్ళ నాన్న ఈ జైలుకు అధికారి.
దేశమంతా లైక్ అని ఓ యాప్ ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. ప్రేమించుకునే వాళ్ళకి, ప్రేమించాలి అని అనుకునేవాళ్ళకి ఈ యాప్ ద్వారా తమ ప్రేమ సత్తా ఏంటో తెలుస్తుంది. ఇదే యాప్‌కి బానిసైన ధీమాని వాస్ ప్రేమిస్తాడు. కానీ వాస్ ప్రేమ నిజమైనది కాదు అని ఆ యాప్ స్పష్టం చేస్తుంది. ధీమాకి తనది స్వచ్ఛమైన ప్రేమ అని, డిజిటల్ ఎమోషన్ కాదు అని వాస్ ఎలా నిరూపిస్తాడో ‘లైక్’ సినిమాలోనే చూడాలి.
సినిమా మొత్తం వినోదాత్మకంగా, నేటి తరం వారికి హెచ్చరికగా, రేపటి తరం వారికి పాఠంగా ఉంటుంది. కాకపోతే కొన్ని సీన్ల దగ్గర పిల్లలను గమనిస్తూ జాగ్రత్త పడాలి. మస్ట్ వాచ్ విత్ ఫ్యామిలీ.
– హరికృష్ణ ఇంటూరు


