టైటిల్: గోదారి గట్టుపైన
నటీనటులు: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్ తదితరులు
నిర్మాణ సంస్థ: రెడ్ పప్పెట్ పొడ్రక్షన్స్
నిర్మాత : అభినవ్ రావు
రచన-దర్శకత్వం : సుభాష్ చంద్ర
సంగీతం: నాగ వంశీకృష్ణ
విడుదల తేది: మే 8, 2026
‘మేమ్ ఫేమస్’తో హీరోగా, దర్శకుడిగా పరిచయమైన సుమంత్ ప్రభాస్..పేరుకి తగ్గట్టే తొలి సినిమాతోనే ఫేమస్ అయిపోయాడు. అయితే ఆ వెంటనే రెండో సినిమా చేయకుండా..దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘గోదారి గట్టుపైన’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గోదారి గట్టుపైన’ హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 8) విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం

కథేంటంటే..
సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసే శ్యాంబాబు(జగపతి బాబు)కి కూతురు మాయ(నిధి ప్రదీప్) అంటే ప్రాణం. తనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండే వ్యక్తితో పెళ్లి చేస్తే.. కూతురు సుఖంగా బతుకుతుందని అనుకుంటాడు. కానీ మాయ మాత్రం ఆటో డ్రైవర్ రాజు(సుమంత్ ప్రభాస్)తో ప్రేమలో పడిపోతుంది. తన కూతురు ఓ ఆటో డ్రైవర్‌ని ప్రేమించిందని తెలిసిన తర్వాత శ్యాంబాబు ఏం చేశాడు? కూతురు ప్రేమను అంగీకరించాడా? లేదా? ఆటో డ్రైవర్ రాజుకి, ఇంజనీరింగ్ చదివే మాయ ఎలా పడిపోయింది? రాజు పోలీసు స్టేషన్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మాయ వాళ్ల నాన్నకు తాను అంటే ఇష్టం లేదని తెలిసిన తర్వాత రాజు ఏం చేశాడు? చివరకు మాయ, రాజు ఎలా ఒక్కటయ్యారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ప్రాణంగా చూసుకునే కూతురు తనకంటే తక్కువ స్థాయి వ్యక్తితో ప్రేమలో పడడం.. ఇది తండ్రికి నచ్చకపోవడం.. కూతురుకి వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేయడం.. చిన్న ట్విస్ట్.. క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్లు ఒక్కటవ్వడం.. ఇలాంటి నేపథ్యంతో తెలుగులో కొన్నేళ్లుగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ‘గోదారి గట్టుపైన’ మూవీ నేపథ్యం కూడా ఇదే. టైటిల్ తగ్గట్టే పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. తండ్రి కంటే గొప్పగా ప్రేమించే వ్యక్తి భర్తగా రావాలని కోరుకున్న అమ్మాయి జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. ప్రేమకు కుల మతాలు అడ్డురావన్న సందేశంతో పాటు పిల్లలు తమ జీవితంలో ఏం జరిగినా.. పెరెంట్స్‌కు చెప్పగలిగేలా పెంపకం ఉండాలని సలహా ఇచ్చే చిత్రమిది. కథ మాదిరే కథనం కూడా రొటీన్‌గా, ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా ఉండడం మైనస్. అలాగే హీరో హీరోయిన్లు ప్రేమలో పడడానికి, విడిపోవడానికి గల కారణాలు కూడా బలంగా లేకపోవడం సినిమా ఆసక్తిని తగ్గిస్తాయి.
ఓ పందెం పోటీతో హీరోని ఆటో డ్రైవర్‌గా పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత అతని ఫ్యామిలీ నేపథ్యాన్ని, స్నేహితుల పాత్రలను పరిచయం చేస్తూ మెల్లిగా అసలు కథలోకి తీసుకెళ్లాడు. మాయ, రాజుల పరిచయ సన్నివేశాలు బాగానే ఉన్నా.. ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమలో పడడానికి గల కారణంగా ఇంకాస్త బలంగా చూపించాల్సింది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. నాన్నకు నచ్చడు అనే కారణంతో రాజుని మాయ దూరం పెట్టడం.. మళ్లీ దగ్గరవ్వడం.. ఈ విషయం శ్యాంబాబు తెలిసిన తర్వాత ఏం చేశాడనేది సెకండాఫ్ స్టోరీ. అయితే ద్వితియార్థంలో కథనం కొంతవరకు సాగదీతగా అనిపిస్తుంది. సుదర్శన్ కామెడీ అక్కడక్కడ నవ్విస్తుంది. రాజు ఫ్యామిలీ ప్లాష్ బ్యాక్, పెళ్లి ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే..
ఆటోడ్రైవర్ రాజు పాత్రకి సుమంత్ న్యాయం చేశాడు. తెరపై చాలా హుషారుగా కనిపిస్తూ.. కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. గోదారి యాస బాగానే మ్యానేజ్ చేశాడు. ఇక నిధి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. నాన్న గారాల పట్టి మాయ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఇక మహాలక్ష్మి పాత్రలో కనిపించిన రీనూ అందంతో ఆకర్షించింది. గబగబా మాట్లాడుతూ అందరిని నవ్విస్తుంది. శ్యాంబాబుగా జగపతి బాబు, అతని భార్యగా లైలా నటించారు. ఈ జోడీని సరిగా వాడుకోవడంతో మాత్రం దర్శకుడు విఫలం అయ్యాడు. లైలా పాత్రకు పెద్ద ప్రాధాన్యతే లేదు. సుదర్శన్ కామెడీ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నాగ వంశీకృష్ణ అందించిన పాటలు బాగున్నాయి. బీజీఎం కొన్ని చోట్ల పాత సినిమాలను గుర్తు చేసినా.. ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కోనసీమ అందాలను తెరపై చక్కగా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


