వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ వంటి ప్రాజెక్ట్స్‌కి పచ్చజెండా ఊపారు ప్రభాస్. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న చిత్రం ‘స్పిరిట్’.
త్రిప్తీ దిమ్రి హీరోయిన్‌గా నటించనున్న ఈ మూవీలో కాంచన, ప్రకాశ్‌రాజ్, వివేక్ ఓబెరాయ్ ఇతర పాత్రలు పోషించనున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో కొరియన్ నటుడు డాన్ లీ విలన్‌గా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌కు సమానంగా పోటీ ఇచ్చే శక్తిమంతమైన ప్రతినాయకుడి పాత్రకి డాన్ లీ సరిపోతారంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో పోస్టులు పెడుతున్నారు.
అయితే ‘స్పిరిట్’లో డాన్‌లీ విలన్‌గా నటిస్తున్నారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. కాగా కొరియన్ మీడియాలో మాత్రం ప్రభాస్ సినిమాలో డాన్ లీ ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ‘‘స్పిరిట్’ అనే సినిమాలో డాన్ లీ నటిస్తున్నారు. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ‘బాహుబలి’ సినిమాతో ఫేమస్ అయిన ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో డాన్ లీ నెగటివ్ పాత్రలో కనిపిస్తారనే వార్త వినిపిస్తోంది’’ అని కొరియన్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ఇక దర్శక–నిర్మాతలు అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం.


